సోమాలియా రాజధాని మొగదీషులో అల్ షబాబ్ టెర్రరిస్టులు బీభత్సం సృష్టిస్తున్నారు. హోటల్ హయత్‌ను తమ అదుపులోకి తీసుకుని పౌరులను హతమారుస్తున్నారు. ఇప్పటి వరకు 13 మంది ఈ దాడిలో మరణించినట్టు తెలిసింది.
న్యూఢిల్లీ: సోమాలియా ప్రభుత్వాన్ని కూల్చడానికి సుమారు పదేళ్లుగా అల్ షబాబ్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. వీలైన ప్రతిసారీ విరుచుకుపడి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సోమాలియా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎక్కువగా దేశ రాజధాని మొగదీషులోని హోటల్ హయాత్‌లో ఉంటారు. ఈ నేపథ్యంలో హోటల్ హయాత్‌ను ఉగ్రవాదులు తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని అనుకున్నారు. ఇందులో భాగంగా పథకం ప్రకారమే శుక్రవారం సాయంత్రం రెండు కార్లలో ఉగ్రవాదులు ఆ హోటల్‌లోకి దూసుకెళ్లారు. తుపాకులు తీశారు. కాల్పులు జరిపారు. ఆ హోటల్‌ను గుప్పిట్లోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ హోటల్ పై దాడిలో 13 మంది మరణించారు.
ఈ హోటల్‌ను టెర్రరిస్టులు తమ స్వాధీనంలోకి తీసుకున్న గంటలు గడిచాయి. వారి చెర నుంచి హోటల్‌ను విముక్తం చేయడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు కూడా జరుగుతున్నాయి. నిన్న రాత్రి హోటల్ మీదుగా దట్టమైన పొగ కనిపించినట్టు స్థానికులు తెలిపారు. బహుశా ఇవి కాల్పులు లేదా పేలుడు వల్ల ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇప్పటి వరకు 13 మంది మరణించినట్టు ఓ సెక్యూరిటీ కమాండర్ వెల్లడించారు. మరో ఐదుగురు బాధితులు మరణించినట్టుగా తమకు సమాచారం వచ్చిందని మొహమెద్ అబ్దికదిర్ తెలిపారు. దీంతో ఈ ఉగ్రవాదుల దాడిలో మరణించిన పౌరుల మొత్తం సంఖ్య 13కు చేరిందని వివరించారు.
కనీసం పది మందిని ఉగ్రవాదులు చంపేశారని పోలీసు అధికారి ఇబ్రహీమ్ దువాలే తెలిపారు. హోటల్ హయాత్‌ను ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న వెంటనే ఓ ప్రకటన విడుదల చేస్తామని వివరించారు. అల్ షబాబ్ ఉగ్రవాదులు శుక్రవారం సాయంత్రం బాంబులు, గన్‌లతో ఈ హోటల్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకున్నప్పటి నుంచి చాలా మంది పౌరులను రక్షించామని చెప్పారు. హోటల్ దాడిలో.. రాజధానిలోని మరో చోట మోర్టార్ దాడిలో గాయపడిన సుమారు 40 మందికి చికిత్స అందిస్తున్నట్టు మొగదీషు ప్రధాన ట్రామా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ మొహమద్ అబ్ది రహ్మాన్ జామా తెలిపారు.
