వియన్నా: ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదులు  హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. ఇటీవల అప్ఘానిస్తాన్ లో దాడికి పాల్పడి చాలామంది ప్రాణాలను బలితీసుకున్న దుర్ఘటనను మరువక ముందే తాజాగా ఆస్ట్రియాలోనూ హింసను సృష్టించారు. ఆస్ట్రియా రాజధాని వియన్నాల్లో సోమవారం ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఇద్దరు పౌరులు మృతిచెందగా ఓ ఉగ్రవాది కూడా హతమయ్యాడు. 

కొందరు ఉగ్రవాదులు మారణాయుధాలతో ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే కాల్పుల్లో ఓ పోలీస్ అధికారితో పాటు మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 

ఉగ్రదాడి సోమవారం రాత్రి 8గంటలకు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కోవిడ్19 వ్యాప్తిని కట్టడి చేయడానికి ఆస్ట్రియా సర్కార్ మరోసారి లాక్డౌన్ విధించడానికి సిద్దమయ్యింది. అయితే ముందుగానే దాడికి కుట్ర పన్నిన ఉగ్రమూక లాక్ డౌన్ విధించడానికి కొన్ని గంటల ముందు షూటింగ్ ప్రారంభించింది. అయినప్పటికి పోలీసులు అప్రమత్తమవడంతో భారీ ప్రాణనష్టం సంభవించలేదు.