ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు సిద్ధం అవుతున్నారు. మొత్తం 12 మందితో కౌన్సిల్ వుంటుందని తెలుస్తోంది. ఈ 12 మందిలో ఇప్పటికే ఏడుగురిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. 

ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాలిబన్లు సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు తాలిబన్ సుప్రీం లీడర్ హయబతుల్లా నేతృత్వంలో కౌన్సిల్‌ను నియమిస్తామన్న తాలిబన్లు.. ఇప్పుడా ప్రక్రియను మొదలుపెట్టారు. మొత్తం 12 మందితో కౌన్సిల్ వుంటుందని తెలుస్తోంది. ఈ 12 మందిలో ఇప్పటికే ఏడుగురిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. కొత్త కౌన్సిల్‌లో ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హామీద్ కర్జాయ్, మరో నేత అబ్దుల్లా, తాలిబన్ కో ఫౌండర్ అబ్ధుల్ ఘనీ బరాదర్, తాలిబన్ లీడర్లు ముల్లా యాకూబ్, ఖలీల్, రెహమాన్ హక్కానీ, హనీఫ్ , గుల్బుద్దీన్‌లు వుంటారని తెలుస్తోంది. మరో ఐదుగురు కౌన్సిల్ సభ్యులను త్వరలోనే ఎంపిక చేస్తారని సమాచారం. 

కాగా, అందరికీ క్షమాభిక్ష పెట్టామని ఎవరి పనులు వారు స్వేచ్ఛగా చేసుకోవచ్చని.. అలాగే మహిళలు సైతం ఉద్యోగాలు చేసుకోవచ్చని తాలిబన్లు తొలి రెండు రోజులు శాంతి మంత్రాలు జపించారు. అయితే రోజులు గడిచే కొద్ది తమలోని పాత మతాచారాలను బయటకు తీస్తున్నారు తాలిబన్లు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి తాజాగా ఆంక్షలు విధించారు. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు బయటకి రావొద్దని తాలిబన్లు హెచ్చరించారు. వారంతా ఇళ్లల్లోనే వుండాలని ఆదేశించారు. భద్రతా సిబ్బంది అనుమతిస్తేనే మహిళా ఉద్యోగులు బయటకు రావాలని తాలిబన్లు హెచ్చరించారు. ఇప్పటికే హెరాత్ ప్రావిన్స్‌లో కో ఎడ్యుకేషన్‌ను తాలిబన్లు నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం వల్ల గవర్నమెంట్ యూనివర్సిటీలపై పెద్దగా ప్రభావం ఉండకపోయినా, ఇప్పటికే మహిళా విద్యార్థుల సంఖ్యపై ఇబ్బంది పడుతున్న ప్రైవేటు వర్సిటీలకు ఇబ్బందిగా భావిస్తున్నారు.