కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో విపక్షనేత సువేందు అధికారితో పాటు  ఆయన సోదరుడిపై కేసు నమోదైంది. ప్రజలకు అందించాల్సిన సహాయ సామాగ్రిని తీసుకెళ్లారనే విషయమై వీరిపై కేసు నమోదు చేశారు అధికారులు.బెంగాల్ రాష్ట్రంలోని కాంతి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డు సభ్యుడైన రత్న దీప్ మన్నా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సువేందు అధికారితో పాటు ఆయన సోదరుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కోల్‌కత్తాకు 150 కి.మీ దూరంలోని పూర్బా మెడినిపూర్ జిల్లాలోని మున్సిపల్ కార్యాలయం నుండి  లక్షలాది రూపాయాల విలువైన  సామాగ్రిని తీసుకెళ్లారనే ఆరోపణలతో కేసు నమోదైంది. 

గత నెల 29 న సువెందు అధికారి, ఆయన సోదరుడు మున్సిపల్ కార్యాలయం గోడౌన్ తాళాలు పగులగొట్టి అందులోని లక్షల రూపాయల విలువైన సహాయ సామాగ్రిని, ట్రక్కు లోడ్ టార్పాలిన్ తదితరాలను బలవంతంగా తీసుకుపోయారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  తమ సెక్యూరిటీగా ఉన్న కేంద్ర దళాలను కూడా వినియోగించుకున్నారని మన్నా ఆరోపించారు. 

ఈ సామాగ్రిని నందిగ్రామ్ లో తుపాను బాధితులకు అందజేశారని తెలుస్తోంది. కాగా ఓ చీటింగ్ కేసులో సువెందు అధికారికి సన్నిహితుడైన రఖల్ బేరా అనే వ్యక్తిని అరెస్టు చేసిన రోజే ఈ కేసు దాఖలైంది. 2019 లో ఇరిగేషన్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఈయన 2 లక్షల రూపాయల లంచం తీసుకున్నాడనే ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.  ఎన్నికలకు ముందు వరకు మమత బెనర్జీకి అత్యంత సన్నిహితుడుగా ఉన్న సువేందు అధికారి ఎన్నికల సమయంలో టీఎంసీకి గుడ్ బై  చెప్పి బీజేపీలో చేరాడు. నందిగ్రామ్ లో మమత బెనర్జీపై సువేందు అధికారి విజయం సాధించారు.