ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు టీచర్‌ను తనను అవమానించిందని, 30 ఏళ్ల తర్వాత ఆమె నివాసాన్ని కనుక్కుని కత్తితో 101 సార్లు పొడిచి చంపేశాడు. స్వయంగా నిందితుడే పోలీసులకు ఈ విషయాన్ని చెప్పాడు. ఈ ఘటన బెల్జియంలో 2020 నవంబర్ 20న చోటుచేసుకుంది. 

న్యూఢిల్లీ: స్కూల్‌లో టీచర్లతో చీవాట్లు తినడం చాలా సాధారణం. మరీ 1990 దశకంలో ఉపాధ్యాయులు హెచ్చరించడం, కొట్టడం సాధారణంగా ఉండేది. విద్యార్థులూ వాటిని కొంత మేరకు పట్టించుకుని ఏ రోజుది అదే రోజు మరిచిపోతారు. కానీ, ఓ విద్యార్థి.. దాన్ని అవమానంగా ఫీల్ అయ్యాడు. 30 ఏళ్లపాటు ఆ టీచర్ దూషణను మరిచిపోలేదు. తద్వార రోజు రోజుకూ ఆ టీచర్‌పై కోపాన్ని పెంచుకున్నాడు. 30 ఏళ్ల తర్వాత ఆ టీచర్ ఇంటికి వెళ్లి కత్తితో పొడిచి.. పొడిచి.. అంటే 101 సార్లు పొడిచేసి హతమార్చాడు. ఈ ఘటన ఐరోపా దేశం బెల్జియంలో చోటుచేసుకుంది.

గంటర్ ఉవెంట్స్ 1990ల్లో పాఠశాల విద్యాభ్యాసం చేశాడు. ఆయన స్కూల్ బాయ్‌గా ఉన్నప్పుడు అదే పాఠశాలలో బోధిస్తున్న టీచర్ మేరియా వెర్లిండన్ ఓ సారి ఆయనపై సీరియస్ అయ్యారు. అప్పుడు ఉవెంట్స్ వయసు ఏడేళ్లు. క్లాసులో తోటి విద్యార్థుల ముందు ఉవెంట్స్‌పై ఆగ్రహించారు. సీరియస్‌గా వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆ టీచర్ తాను చేసిన వ్యాఖ్యలను మరిచిపోయారు. మళ్లీ ఎప్పట్లాగే తన పనుల్లో పడిపోయారు. కానీ, ఉవెంట్స్ మాత్రం ఆ ఘటనను మరిచిపోలేకపోయాడు.

2020లో ఆ టీచర్ మేరియా వెర్లిండన్ నివాసాన్ని కనిపెట్టాడు. ఆంట్వర్ప్‌లోని హెరెంటల్స్ సమీపంలోని వెర్లిండన్ నివాసానికి పక్కా ప్లానింగ్‌తో ఉవెంట్స్ వెళ్లాడు. 2020 నవంబర్ 20న ఆ నివాసంలో అడుగుపెట్టగానే పథకాన్ని అమలు చేశాడు. కత్తి తీసి 101 సార్లు పొడిచి చంపేశాడు. ఆమెకు అతి సమీపంలో నగదుతో కూడిన పర్సు పడి ఉన్నది. కానీ, దాన్ని ఆయన ముట్టుకోలేదు. టీచర్‌ను చంపేసి బయట పడ్డాడు.

పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేశారు. కానీ, నిందితుడిని కనిపెట్టడం చాలా కష్టంగా మారింది. అయితే, టీచర్‌ను తానే హతమార్చిన విషయాన్ని ఉవెంట్స్ తన ఫ్రెండ్ ఒకరితో చెప్పాడు. ఆ ఫ్రెండ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు ఉవెంట్స్‌ను అధీనంలోకి తీసుకున్నారు.

దర్యాప్తు చేపట్టగా.. పోలీసులకు ఉవెంట్స్ ఈ విషయాలను వెల్లడించాడు. తాను ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు వెర్లిండన్ తనకు స్కూల్ టీచర్‌గా ఉన్నారని, ఆమె తనను అవమానించారని, అందుకు ప్రతీకారంగానే ఆమెను హత్య చేసినట్టు చెప్పారని అధికారులు వివరించారు. అయితే, ఆ ఘటనా సమయంలో దొరికిన సాక్ష్యాలను, ఉవెంట్స్ డీఎన్ఏ శాంపిళ్లు, ఇతర ఆధారాలను పరీక్షించి నేరానికి పాల్పడింది ఉవెంట్సేనా? కాదా? అని పరిశీలించనున్నారు. ఆయన చెప్పినదీ కట్టుకథా? లేక నిజమేనా? అని కూడా తేలుస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అయితే, ఆయన చెప్పిన విషయాలు తన వాంగ్మూలంగానే ఉన్నదని, హత్యా నేరాన్ని అంగీకరించాడని చెప్పారు.