శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకానపడింది. దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత దృష్ట్యా పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటించారు. ప్రధానిగా విక్రమసింఘేను తప్పించి రాజపక్సను అధ్యక్షుడు నియమించడంతో లంకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది.

ఇది పెద్ద దుమారానికి దారి తీసి ప్రభుత్వ మనుగడపై ప్రభావం చూపింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన అధ్యక్షుడు ఈ నెల 16 వరకు పార్లమెంటును తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లుగా గత నెలలో ప్రకటించారు.

అయితే పరిస్థితులు మరింత ఘోరంగా తయారవ్వడంతో గడువుకన్నా 20 నెలల ముందుగానే పార్లమెంటును రద్దు చేస్తున్నట్లుగా సిరిసేన వెల్డించారు. 225 మంది సభ్యులన్న శ్రీలంక పార్లమెంటుకు వాస్తవానికి 2020 ఆగస్టు వరకు గడవుంది. కానీ దాదాపు 20 నెలల ముందుగానే పార్లమెంటు రద్దు కావడంతో.. జనవరి 5న ఎన్నికలు జరగనున్నాయి.