శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు పరిసర ప్రాంతాల్లో వరుస పేలుళ్లకు పాల్పడిన వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పేలుళ్లు జరిగిన నాటి నుంచి నేటి వరకు ఈ కేసులో 106 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఓ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ కూడా ఉన్నారు.

సదరు టీచర్ వద్ద 50 సిమ్‌కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీలంక సైన్యంతో పాటు పోలీసు సంయుక్తంగా జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో వీరిని గుర్తించారు. వీరిని దంగేదరాలోని గల్లే ప్రాంతంలో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.

శుక్రవారం ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రిన్సిపల్, టీచర్ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోజు రాత్రి కల్మునై నగరంలో సైంథముర్తు ప్రాంతంలో ఒక ఇంటిలో ఉగ్రవాదులు దాగివున్నట్లు సమాచారం అందడంతో శ్రీలంక ప్రత్యేక బలగాలు దాడి చేశాయి.

అయితే వీరి రాకను గుర్తించిన తీవ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు దిగాయి. ఇరు పక్షాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. తమ మీద సైన్యం పై చేయి సాధించేలా ఉండటంతో ముగ్గురు ఉగ్రవాదులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో భద్రతా దళాలతో పాటు సాధారణ పౌరులతో కలిపి మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు.