శ్రీలంక అధ్యక్ష భవనంలోకి చొరబడిన నిరసనకారులు.. అక్కడ నిరసనకారులు స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కొట్టడం, ఆహారం తినడం వంటి వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే అధ్యక్ష భవనంలో ఆందోళనకారులు.. మిలియన్లు విలువ చేసే కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతుంది. ఈ క్రమంలోనే గత కొద్ది నెలలుగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా నిరసనకారుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. శనివారం సెంట్రల్ కొలంబోలోని హై-సెక్యూరిటీ ఫోర్ట్ ఏరియాలోని ఆ దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే అధికారిక నివాసం వద్ద నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ఇక, ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసంలోకి ప్రవేశించిన మరో వర్గం ఆందోళనకారులు ఇంటికి నిప్పంటించారు.
అయితే శ్రీలంక అధ్యక్ష భవనంలోకి చొరబడిన ఆందోళనకారులు.. అక్కడ నిరసనకారులు స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత కొట్టడం, ఆహారం తినడం వంటి వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే అధ్యక్ష భవనంలో ఆందోళనకారులు.. మిలియన్లు విలువ చేసే కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. నిరసనకారులు అధ్యక్ష భవనంలో భారీగా కరెన్సీ నోట్లను లెక్కిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రికవరీ చేసిన డబ్బును భద్రతా విభాగాలకు అందజేస్తామని నిరసనకారులు చెప్పినట్టుగా డైలీ మిర్రర్ వార్తాపత్రిక నివేదించింది. అయితే అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో నిజాలను పరిశీలించిన తర్వాత వాస్తవాలను తెలుసుకోగలమని చెబుతున్నారు.
ఇక, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు అదుపుతప్పవచ్చనే ముందస్తు సమాచారంతో గోటబయ రాజపక్స ముందుగానే ఇంట్లో నుంచి పారిపోయారు. ఆయన ఎక్కడనున్నారనే దానిపై ఇప్పటివరకు సమాచారం లేదు. గోటబయ రాజపక్సే నౌకలో పారిపోయారని, శ్రీలంకలోనే ఎక్కడో తలదాచుకున్నారనే.. వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే దీనిపై స్పష్టత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తదుపరి రాజకీయ ఎత్తుగడపై ఊహాగానాలు మాత్రమే వస్తున్నాయి. తాజా సంక్షోభం దృష్ట్యా గోటబయ రాజపక్స.. మే నెలలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన తన సోదరుడు మహీందా రాజపక్స అడుగుజాడలను అనుసరించవచ్చని భావిస్తున్నారు.
మరోవైపు ప్రజాగ్రహం నేపథ్యంలో తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె శనివారం ప్రకటించారు. అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరిస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పారు. ఇక, అధ్యక్షుడు, ప్రధానమంత్రి ఇద్దరూ లేనప్పుడు స్పీకర్ తాత్కాలిక అధ్యక్షునిగా వ్యవహించాల్సి ఉంటుంది. తర్వాత కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఎంపీల మధ్య ఎన్నికలు జరగాలి.
