శ్రీలంకలో ఆందోళనకారులు రాజధాని చేరుకోవడమే కాదు.. ఈ సారి అధ్యక్షుడు, ప్రధానమంత్రి అధికారిక నివాసాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ రెండు భవనాల్లో వారు వారికి ఇష్టం వచ్చినట్టుగా గడుపుతున్నారు. ఒకరకంగా కొందరైతే పిక్నిక్ వచ్చి రిలాక్స్ అవుతున్నట్టే కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

న్యూఢిల్లీ: శ్రీలంకలో ఆందోళనకారులు అటు అధ్యక్ష భవనాన్ని, ఇటు ప్రధాని భవనాన్ని చేరిపోయారు. అందులో వారి ఆగడాలు అంతా ఇంతా కాదు. ఎవరికి తోచింది వారు చేస్తున్నారు. అలాగే.. పలు రహస్యాలను వారు ఛేదించారు. డబ్బులు కట్టలు కట్టలుగా లభించాయి. రహస్య గదులూ కనిపించాయని వారు చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అందులో చాలా మంది అధికారిక నివాసాల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. 

శ్రీలంక అధ్యక్షుడి అధికారిక నివాసం లోకి జెండాలు, నినాదాలతో ప్రవేశించిన నిరసనకారులు కొంత కాలం ఆందోళనలు చేశారు. ఆ తర్వాత కొంత కూల్ డౌన్ అయ్యారు. సరిగ్గా చెప్పాలంటే కొందరు అక్కడి స్విమ్మింగ్ పూల్‌లో దూకి కూల్ అయ్యారు. ఈతలు కొడుతూ... అందులో దూకుతున్న వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Scroll to load tweet…

తాజాగా, ప్రధాని అధికారిక నివాసం (టెంపుల్ ట్రీ) లో కొందరు ఆందోళనకారులు హంగామా చేస్తూ కనిపించారు. ప్రధాని బెడ్ రూమ్‌ లోకి వెళ్లి అక్కడి బెడ్ పై WWE ఫైట్ చేస్తూ కనిపించారు. అచ్చు WWE ఫైట్ తరహా లోనే వారు పర్ఫార్మ్ చేశారు.

ఇక అధ్యక్ష భవనంలో పలువురు నిరసనకారులు స్విమ్మింగ్ పూల్‌లో ఈతలు కొట్టడమే కాదు.. జిమ్ వర్కౌట్ చేస్తూ కనిపించారు. కాగా, కొందరు వంటలు చేస్తుంటే.. ఇంకొందరు డైనింగ్ రూమ్‌లో భుజించారు. ఇంకొందరైతే.. కాన్ఫరెన్స్ రూమ్‌లోకి వెళ్లి అధ్యక్షుడు రాజీనామా చేయాలని ప్రకటనలు విడుదల చేశారు. అలాగే, అధ్యక్ష భవనం లోని ఖరీదైన కార్ల వద్దకు వెళ్లి పలువురు సెల్ఫీలు తీసుకున్నారు. 

Scroll to load tweet…

కొందరు గార్డెన్‌లో తమ పిల్లలను కూర్చోబెట్టుకుని ఆహారం తినిపిస్తున్నారు. ఇంకొందరు సుందరమైన ఆ భవనంలో ఎక్కడో చోట నిలిచుని సెల్ఫీలు తీసుకుంటున్నారు. మరికొందరు అక్వేరియం దగ్గర సరదాగా గడుపుతున్నారు. కాగా, మరికొందరు అధ్యక్ష భవనంలోని రహస్యాలను ఛేదించే పనిలో పడ్డారు. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు అధ్యక్షుడు తాత్కాలికంగా దాక్కోవడానికి ఏర్పాటు చేసే రహస్య బంకర్‌ ను కొనుగొన్నారు. కిందకు భూమి లోకి ఉన్న మెట్లను చూసి ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా ప్రధానమంత్రి పర్సనల్ నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే.