ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు మద్దతు ఇస్తుందనే కారణంతో బెలారస్‌పై ఆంక్షల్ని విధించేందుకు సిద్ధమైనట్లు దక్షిణ కొరియా ప్రకటించింది. దాదాపుగా రష్యాపై విధించిన ఆంక్షల్నే బెలారస్‌పైనా విధించాలని సౌత్ కొరియా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర (russia ukraine crisis) కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఎవరెన్ని చెప్పినా.. పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్నా రష్యా అధినేత (russia president) మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పుతిన్‌కు సొంతదేశంలోనే నిరసన సెగ ఎదురవుతున్నా.. బెలారస్ మాత్రం రష్యాకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ సమాజం.. ఆ చిన్న దేశంపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యాకు మద్దతు ఇస్తుందనే కారణంతో బెలారస్‌పై ఆంక్షల్ని విధించేందుకు సిద్ధమైనట్లు దక్షిణ కొరియా (south korea) ఆదివారం ప్రకటించింది. ఎలాంటి ఆంక్షలు విధించబోతున్న విషయాన్ని స్పష్టం చేయనప్పటికీ.. దాదాపుగా రష్యాపై విధించిన ఆంక్షల్నే బెలారస్‌పై (belarus) కూడా అమలు చేయనున్నట్లు సమాచారం. గత నెలలో రష్యాకు ఎగుమతులపై దక్షిణ కొరియా నియంత్రణలను కఠినతరం చేసింది.. అలాగే రష్యన్ బ్యాంకులతో లావాదేవీలను నిలిపివేసింది.
ఈ వ్యవహారంపై దక్షిణ కొరియా మంత్రి ఒకరు తాజాగా మాట్లాడుతూ ఉక్రెయిన్‌పై రష్యా దాడికి బెలారస్ మద్దతు ఇస్తోంది. దీంతో బెలారస్‌పై కూడా ఎగుమతి నియంత్రణ చర్యలను అమలు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. అయితే రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై దాడికి బెలారస్‌ను ఒక ముఖ్యమైన వేదికగా ఉపయోగించుకుంది. ఈ విషయమై బెలారస్ అధినేత అలెగ్జాండర్ లుకాషంకోను (alexander lukashenko) ప్రశ్నించగా తమ దేశానికి చెందిన దళాలు యుద్ధంలో పాల్గొనడం లేదని వాదిస్తున్నారు.
మరోవైపు.. రష్యాపై ఇప్పటికే అనేక పాశ్చాత్య దేశాలు, క్రీడా సంస్థలు, బడా కంపెనీలు ఆంక్షల కత్తి దూశాయి. అంతర్జాతీయంగా రష్యాను ఒంటరి చేయాలనే ఉద్దేశంతో మరిన్ని దేశాలు, సంస్థలు ఈ జాబితాలో వచ్చి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ కొరియా మరింత ముందడుగు వేసి రష్యాతో పాటు రష్యాకు సహాయం చేస్తున్న దేశాలపై కూడా ఆంక్షలకు సిద్ధమవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ క్రమంలోనే ఉక్రెయిన్ తో పాటు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న దేశాలపై విమర్శలు గుప్పించారు వ్లాదిమిర్ పుతిన్. ఉక్రెయిన్ పై జరుపుతున్న యుద్ధాన్ని పుతిన్ సమర్థించుకున్నారు. ముందుగా రష్యా శాంతియుతంగా వివాదాల పరిష్కారానికి ప్రయత్నించిందని తెలిపారు. అయితే ఉక్రెయిన్ దీనికి అడ్డంకులు సృష్టించిందని, శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. నాటో తో చేతులు కలుపుతూ ముందుకు సాగిందని అన్నారు. అందుకే తమ దేశానికి ముప్పుగా మారిన ఉక్రెయిన్‌ను సైనిక, అణ్వాయుధ రహితంగా చేస్తామన్నారు. ఈ లక్ష్యం నెరవేరే వరకు యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు.
