ట్విన్స్ పుట్టాలని చాలామంది ఆశపడతారు. కొంతమందికి ట్రిపులేట్ మరికొంతమందికి నలుగురు పుట్టిన సంఘటనలూ ఉన్నాయి. అయితే ఓ దక్షిణాఫ్రికా మహిళకు ఏకంగా ఒకే కాన్పులో పదిమంది పిల్లలు పుట్టారు. 

దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఏకంగా ఒకే కాన్పులో 10మంది పిల్లలకు జన్మనిచ్చి రికార్డుల్లోకి ఎక్కింది. తాను ఒకే కాన్పులో 10మంది పిల్లలకు జన్మనిచ్చినట్టు దక్షిణాఫ్రికాకు చెందిన గొసియామీ థామర సిట్ హోల్ (37) అనే మహిళ ప్రకటించింది. 

 దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా నగరంలో సోమవారం రాత్రి తన భార్యకు సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగిందని, ఏడుగురు మగ శిశువులు, ముగ్గురు ఆడ శిశువులు జన్మించారని ఆమె భర్త టెబోగో సోటెట్సీ చెప్పారు. 

తన భార్య గర్భం దాల్చి 7 నెలల 7 రోజులైందని, నెలలు నిండకుండానే 10మంది పుట్టారని టెబోగో సోటెట్సీ తెలిపాడు. తనకు చాలా ఆనందంగా ఉందని, ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనంటూ భావోద్వేగానికి గురయ్యాడు టెబోగో సోటెట్సీ. 

అయితే ఒకే కాన్పులో ఇంతమంది పిల్లలు పుట్టడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అవుతుందని చెబుతున్నారు. సిట్ హోల్  గతంలోనూ కవలలకు జన్మనివ్వడం ఇక్కడ కొసమెరుపు.