ఎవరైనా చనిపోతే సాధారణంగా అస్తికలు ఏ పవిత్ర నదీ జలాల్లోనో కలుపుతుంటారు. దీనివల్ల వారి ఆత్మకు ముక్తి లభిస్తుందని నమ్మకం. అయితే ఓ కొడుకు మాత్రం తన తండ్రి అస్తికల్ని డ్రైనేజీలో కలిపాడు. చదువుతుంటే షాకింగ్ గా ఉంది కదా... కానీ ఇది నిజం. అయితే ఇలా కలపడం వెనుక ఓ ట్విస్ట్ ఉంది...

ముందుగా వివరాల్లోకి వెడితే.. బ్రిటన్ కు చెందిన కెవిన్ మెక్ గ్లిన్సీ అనే 66యేళ్ల వ్యక్తికి పబ్ అంటే చాలా ఇష్టం. అక్కడి కోవెంట్రీలోని ‘హోటీ బుష్’ పబ్ అంటే ఎంతో ఇష్టం. ప్రతీరోజూ అక్కడికి వెళ్లేవాడు, చల్లగా ఓ గ్లాసు బీరు తాగితే ఆయనకు ఎంతో ప్రశాంతంగా ఉండేది. 

అయితే కెవిన్ అనుకోకుండా అస్వస్థత గురయ్యాడు. చావు దగ్గర పడుతున్న కొద్దీ అతనితో పబ్ మీద కోరిక పెరిగిపోసాగింది. దీనికోసం కుటుంబ సభ్యులను ఓ వింత కోరిక కోరాడు. ఆ పిచ్చి కోరిక విని మొదట అందరూ షాక్ అయ్యారు. ఆ తరువాత దాని వెనకున్న రహస్యం తెలుసుకుని అలాగే అని మాటిచ్చారు. 

ఇంతకీ అతను కోరిన కోరిక ఏంటంటే.. తను చనిపోయిన తరువాత తన అస్థికలను పబ్ ముందున్న డ్రైనేజీలో కలపాలని అడిగాడు. తండ్రికిచ్చిన మాట ప్రకారం మరణం తరువాత వచ్చిన అతడి మొదటి జయంతి రోజున కెవిన్ కొడుకు ఓవెన్, కూతురు కాస్సిడీ మిగతా కుటుంబసభ్యులు హోలీ బుష్ పబ్ కు వెళ్లారు.

అక్కడ ఓ గ్లాస్ బీరు కొనుక్కుని దాంట్లో తండ్రి అస్తికలు కలిపి.. ఆ బీరును పబ్ ముందున్న డ్రైనేజీలో పారబోశాడు. దీంతో తండ్రి చివరి కోరిక తీరింది. దీనిమీద కొడుకు ఓవెన్ మాట్లాడుతూ.. మా నాన్నను హోలీబుష్ పబ్ అంటే ఎంతో ఇష్టం. 

వారిద్దరి అనుబంధం ప్రత్యేకం.. ఆయన ప్రతీరోజు అక్కడికి వెళ్లేవారు. అక్కడ డ్రైనేజీలో తరచూ ఏదో ఒకటి పడేసేవారు.జుట్టు, గోర్లు లాంటివన్నమాట. అలాంటిది తన అస్తికలు అందులో ఎందుకు కలపమన్నారంటే.. మేము అటువైపు వెళ్లిన ప్రతీసారి గుర్తుకురావాలనే ఆయన ఉద్దేశ్యం.. అని చెప్పుకొచ్చారు.