క్రిస్మస్ పండుగకు కొద్దిరోజుల ముందు ఫ్రాన్స్ ఉలిక్కిపడింది. స్ట్రాస్‌బర్గ్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే మార్కెట్‌లో క్రిస్మస్ షాపింగ్‌ చేస్తోన్న వారిపై దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న  పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాల్పులకు తెగబడిన నిందితుడిని స్ట్రాస్‌బర్గ్‌కే చెందిన చెరిఫ్‌గా గుర్తించారు. కాల్పులకు ముందు అతను అల్లాహో అక్బర్ అని నినదించినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

క్రిస్మస్ మార్కెట్‌కు సమీపంలోనే అతడు నివసిస్తాడని స్థానికులు తెలిపారు. చెరిఫ్‌పై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని...పలు నేరాల్లో ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో ఇది వరకే అతడు 27 సార్లు శిక్షలను అనుభవించాడని ఫ్రాన్స్ ఇంటీరియల్ మినిస్టర్ తెలిపారు.

ఓ హత్యాయత్నం కేసులో చెరిఫ్‌ను అరెస్ట్ చేయడానికి అతనికి ఇంటికి పోలీసులు వెళ్లారని.. ఆ సమయంలో అతడు ఇంట్లో లేడని...ఓ గ్రెనేడ్, పిస్టల్, నాలుగు కత్తులను స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో చెరిఫ్‌కు గాయపడ్డట్టు సమాచారం..

అనంతరం అతను ట్యాక్సీలో పారిపోయినట్లు తెలుస్తోంది. స్ట్రాస్‌బర్గ్ కాల్పుల నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. అన్ని క్రిస్మస్ మార్కెట్లలో భద్రతను కట్టుదిట్టం చేసింది. యూరోపియన్ పార్లమెంట్ భవనం సహా దుకాణాలను మూయించి వేశారు. చెరిఫ్ కోసం పోలీసులు దేశవ్యాప్తంగా గాలింపు చేపట్టారు.