Secret Op: సముద్రంలో సీక్రెట్ కోవర్ట్ ఆపరేషన్.. అమెరికా సైనికులు మిస్సింగ్.. ఎర్ర సముద్రంలో ఏం జరిగింది?
యూఎస్ నేవీ ఆర్మీ ఎర్రసముద్రంలో ఓ సీక్రెట్ కోవర్ట్ ఆపరేషన్ కోసం వెళ్లింది. ఎర్రసముద్రంలో నౌకలపై దాడి చేస్తున్న హౌతీలకు ఆయుధాల సరఫరాను అడ్డుకోవాలనుకుంది. ఓ షిప్‌ను గుర్తించి అందులోని ఆయుధాలను సీజ్ చేసింది. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు సైనికులు మిస్ అయ్యారు.
Houthi: గాజా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో రక్తపుటేరులు పారిస్తున్నది. వంద రోజులు దాటిన ఈ యుద్ధంలో సుమారు 24 వేల మంది ప్రజలు మరణించారు. హమాస్ పై దాడిగా చెప్పి గాజా మొత్తాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తున్నది. ఇక్కడే యూదులు, ముస్లింలు అనే వాదనలు తెరమీదికి వచ్చి ఎవరిది న్యాయం? ఎవరిది అన్యాయం? అనే చోటే చర్చ ఆగిపోతున్నది. కానీ, యుద్ధాన్ని ఆపే బలమైన ప్రయత్నాల వరకూ వెళ్లలేకపోతున్నది. ఒక చోట యుద్ధం మరో చోట ప్రకంపనలే కాదు.. మరో చోట యుద్ధాన్ని కూడా సృష్టించే పరిస్థితులు నేడు ఉన్నాయి. గాజా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ఎర్ర సముద్రం కేంద్రంగా కొత్త యుద్ధానికి తెరతీసేలా పరిస్థితులు మారుతున్నాయి.
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హౌతి మిలిటెంట్లు యెమెన్ సమీపంగా వెళ్లే నౌకలను పేల్చేసే పనిలో ఉన్నాయి. అయితే, ఏ దేశపు నౌక అనే పట్టింపు లేకుండా దేన్నైనా ధ్వంసం చేస్తున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థపై, వాణిజ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపే ముప్పు ఉన్నది. ఈ హౌతిలను ఎదుర్కోవడానికి అమెరికన్ నేవీ ఓ ఆపరేషన్ చేపట్టింది.
Also Read: Explained: మన బలగాలను మాల్దీవులు ఎందుకు వెనక్కి పంపించాలని అనుకుంటున్నది? చైనా పాత్ర ఏమిటీ?
అమెరికా నేవీలోని ప్రత్యేక దళమైన సియల్స్ రాత్రిపూట ఎర్రసముద్రంలో ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. హౌతి తిరుగుబాటుదారులకు విధ్వంసక ఆయుధాల సరఫరాను ఆపాలని బయల్దేరింది. హెలికాప్టర్లు, అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్స్ సహాయంతో నేవీ సియల్స్ విజయవంతంగా ఓ నౌకను సోమాలియా తీరంలోని అరేబియన్ సముద్రపు అంతర్జాతీయ జలాల్లోకి తీసుకురాగలిగింది. ఇరాన్ దేశం తయారు చేసిన బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిస్సైల్ కంపోనెంట్లు, ప్రొపల్షన్, గైడెన్స్, హౌతిలు వినియోగించే మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్‌కు అవసరమైన వార్ హెడ్స్, యాంటీ షిప్ మిస్సైల్స్ సహా ఇతర ఆయుధాలను ఈ షిప్ నుంచి యూఎస్ ఆర్మీ సీజ్ చేసింది.
ఎర్ర సముద్రంలో నౌకలపై డ్రోన్ దాడులకు, క్షిపణి దాడుల కోసం హౌతీలు ఈ సీజ్ చేసిన ఆయుధాలను ఉపయోగించినట్టు యూఎస్ నేవి సియల్స్ ప్రాథమిక విశ్లేషణలో బయటపడింది. దీని ద్వారా హౌతీ దాడులకు ఇరాన్‌కు ప్రత్యక్ష సంబంధానికి ఈ పరిణామాలు సంకేతాలు ఇస్తున్నాయని పేర్కొంది. ఈ వ్యవహారం ఇరాన్, దాని ప్రాక్సీలకు అమెరికా, దాని మిత్రపక్షాలకు మధ్య యుద్ధంగా పరిణమిస్తుందా? అని సెక్యూరిటీ, డిఫెన్స్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: YS Sharmila: అన్నా, చెల్లి మధ్య వైరం ఎందుకు మొదలైంది? జగన్‌ను నేరుగా ఢీకొడుతారా?
ఈ ఆపరేషన్ చేపడుతుండా ఇద్దరు యూఎస్ నేవి సియల్స్ సిబ్బంది మిస్ అయ్యారు. సముద్రంలో వీరిద్దరూ మిస్ అయ్యారని అమెరికా తొలుత వెల్లడించింది. వీరిద్దరూ ఈ ఆపరేషన్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అదృశ్యమైన మా బృంద సభ్యుల కోసం తాము తీవ్ర గాలింపు చర్యలు చేపడుతున్నామని ఎస్ సెంట్‌కామ్ కమాండర్ తెలిపారు.
అమెరికా నేవీ ఆ నౌకను నీట ముంచేసింది. ఆ నౌక అన్‌సేఫ్ అని కనుగొన్నాక ముంచింది. అయితే, ఆ నౌకపై ఉన్న 14 మంది క్రూ మెంబర్స్‌ను అదుపులోకి తీసుకుంది. వారిని అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ప్రాసిక్యూట్ చేస్తామని పేర్కొంది.