Explained: మన బలగాలను మాల్దీవులు ఎందుకు వెనక్కి పంపించాలని అనుకుంటున్నది? చైనా పాత్ర ఏమిటీ?
ఇటీవల సోషల్ మీడియాలో బాయ్ కాట్ మాల్దీవుల హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అయింది. ఇదే తరుణంలో మాల్దీవుల్లో నుంచి భారత బలగాలను వెనక్కి పిలుపించుకోవాలని, అందుకు డెడ్ లైన్ కూడా ఆ దేశ అధ్యక్షుడు విధించాడు. సుదీర్ఘకాలంగా భారత్‌తో ఎంతో సామరస్యంగా ఉన్న మాల్దీవులు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏమిటీ? రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారాయి? ఇందులో చైనా పాత్ర ఏమైనా ఉన్నదా? మాల్దీవుల్లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం భారత్ పట్ల అనుసరించదలిచిన విధానం ఎలాంటిది? వంటి విషయాలను చూద్దాం.
Maldives: మాల్దీవుల కొత్త అధ్యక్షుడు భారత్‌కు ఓ డెడ్ లైన్ పెట్టారు. మార్చి 15వ తేదీ వరకు ఆ దేశంలోని భారత బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని పేర్కొన్నారు. మాల్దీవులు అధ్యక్షుడు మొహమద్ మోయిజ్జు చైనా పర్యటన చేసిన వెనువెంటనే ఈ డెడ్ లైన్ పెట్టారు. అయితే, ఈ డిమాండ్ పై భారత్ అధికారికంగా ఇంకా ఎలాంటి స్పందన విడుదల చేయలేదు.
మాల్దీవుల్లో ఎన్ని భారత బలగాలు ఉన్నాయి?
మాల్దీవుల్లో 77 మంది భారత సోల్జర్లు ఉన్నారని ఉభయ దేశాలు చెబుతున్నాయి. భారత భద్రతా బలగాల నుంచే 12 మంది ఆరోగ్య సిబ్బంది కూడా ఉన్నారు.
అక్కడ ఎందుకు ఉన్నారు?
ఈ ద్వీప సముదాయ దేశంలో ఏదైనా విపత్తు సంభవించినప్పుడు రక్షించడానికి, వైద్య సేవలు అందించడానికి, మానవతా సహాయం చేయడానికి వీరిని అక్కడికి పంపించినట్టు భారత్ చెబుతున్నది. ఇందుకోసం రెండు హెలికాప్టర్లు, డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను భారత్ మాల్దీవులకు ఇచ్చింది. వీటిని సముద్ర జలాలపై నిఘా వేసి ఉంచడానికి, రక్షణ పరమైన ఆపరేషన్లకు వినియోగిస్తున్నారు. భారత జవాన్లు ఈ ఆపరేషన్లు నిర్వహిస్తారు.
తొలి హెలికాప్టర్, సిబ్బంది మాల్దీవుల్లో 2010లో సేవలు ప్రారంభించారు. అప్పుడు ఆ ద్వీప దేశ అధ్యక్షుడిగా మహమద్ నషీద్ ఉన్నారు.
ఇప్పుడు మన బలగాలను ఎందుకు వద్దంటున్నది?
వ్యూహాత్మక భౌగోళిక ప్రాంతంలో ఉన్న మాల్దీవులతో భారత్ సుదీర్ఘకాలంగా బలమైన సత్సంబంధాలను నెరపుతున్నది. ఆ దేశం 5 లక్షల ప్రజల కోసం ఆహార దాన్యాలు, కూరగాయలు, మెడిసిన్స్, మానవతా సహాయం కోసం భారత్ పై ఆధారపడింది.
1998లో అప్పటి అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ పై తిరుగుబాటు ప్రయత్నం జరిగినప్పుడు భారత మిలిటరీ వెంటనే అక్కడికి వెళ్లింది. పరిస్థితులు అదుపులోకి రాగానే తక్షణమే భారత బలగాలు వెనక్కి వచ్చాయి. కానీ, మాల్దీవుల అంతర్గత రాజకీయాల్లో భారత జోక్యాన్ని, భారత్ పై ఆ దేశం ఆధారపడటాన్ని ఆ దేశ పౌరుల్లో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మొన్నటి వరకు మాల్దీవులు భారత్‌కు సత్సంబంధాలనే కొనసాగించింది. కానీ, అక్కడి అల్ట్రా నేషనలిస్టులు, ఇతర మరికొన్ని సముదాయాలు భారత్‌తో సత్సంబంధాలను వ్యతిరేకించాయి. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన ముయిజ్జు కూడా ఇండియా ఔట్ క్యాంపెయిన్ చేసినవారే. అప్పటి వరకు ఆ దేశాధినేతల వైఖరికి భిన్నంగా భారత వ్యతిరేక విధానాన్ని అనుసరించారు.
భారత ప్రభావాన్ని ఆ దేశ సార్వభౌమత్వానికి ప్రమాదకారిణిగా ముయిజ్జు అభిప్రాయపడ్డారు. మాల్దీవుల భూభాగం నుంచి భారత బలగాలను వెనక్కి పంపిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అయితే, సీవోపీ 28 సమావేశాలు జరుగుతుండగా యూఏఈలో డిసెంబర్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు భేటీ అయ్యారు. బలగాలు మాల్దీవుల్లో ఉండటం సహా ఇతర అంశాలపై ఒప్పందాలను సమీక్షించుకోవడానికి అంగీకరించారు.
ఇందులో చైనా ప్రమేయం ఏమిటీ?
వ్యూహాత్మక భౌగోళిక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఇండియా, చైనా దేశాలు మాల్దీవులతో సఖ్యంగా ఉండటానికి మొగ్గు చూపుతాయి. హిందూ మహాసముద్రంలో కీలకమైన నావికా మార్గంలో ఈ దీవులు ఉంటాయి. చైనాకు చమురు దిగుమతుల్లో 80 శాతం ఈ దీవులకు సమీపంగానే రవాణా అవుతాయి.
మాల్దీవుల్లో చైనా మిలిటరీ ఉంటే అది ఈ రీజియన్‌కే ఓ ముప్పుగా మన దేశం భావిస్తుంది.
Also Read: YS Sharmila: ఏపీపీసీసీ చీఫ్ పదవికి గిడుగు రాజీనామా.. రెండు రోజుల్లో షర్మిలకు పగ్గాలు!
ఎర్ర సముద్రంలో హౌతి మిలిటెంట్లు నావలపై దాడుల నేపథ్యంలో నావికా మార్గాల ప్రాముఖ్యత, వాటి రక్షణకు ప్రాధాన్యత మరింత పెరిగింది.
మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు గతవారం చైనా పర్యటించినప్పుడు వ్యూహాత్మక సహకార భాగస్వామ్య సంబంధాలను ఈ ఉభయ దేశాల ఉన్నతీకరించాయి. ఇక్కడ మరొక విషయం గుర్తు పెట్టుకోవాలి. వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం, మాల్దీవులు ఆ దేశ అప్పులో 20 శాతం(1.37 బిలియన్ డాలర్లు) చైనాకు రుణపడి ఉన్నది.