రష్యా సైన్యం స్వాధీనం చేసుకున్న తర్వాత చెర్నోబిల్ అణు కర్మాగారానికి సమీపంలోని ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ ‘‘గామా’’ రేడియేషన్ స్థాయిలు కనుగొనబడినట్లు ఉక్రెయిన్ అణుశక్తి నియంత్రణా సంస్థ తెలిపింది. అయితే ఆ ప్రాంతంలో రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే వున్నాయని రష్యా చెబుతోంది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం (russia ukraine crisis) ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచం పుతిన్‌ను (putin) ఎలా ఆపాలా అని చూస్తోంది. అమెరికా, జర్మనీ, బ్రిటన్‌లు ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అటు యూరోపియన్ యూనియన్ కూడా పుతిన్ ఆస్తులను ఫ్రీజ్ చేసింది. అయినప్పటికీ ఆయన ఏ మాత్రం తగ్గడం లేదు. ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆక్రమించుకోవాలని ఆయన రష్యా సేనలను ఆదేశించారు. యుద్ధాన్ని ఆపొద్దని బలగాలకు సూచించారు. మరోవైపు యుద్ధం నేపథ్యంలో నాటో కూటమి కీలక సమావేశం నిర్వహించనుంది.
ఈ నేపథ్యంలో చెర్నోబిల్ అణు రియాక్టర్‌పై అందరి దృష్టి పెరిగింది. రష్యా సైన్యం దీనిని స్వాధీనం చేసుకున్న తర్వాత చెర్నోబిల్ అణు కర్మాగారానికి సమీపంలోని ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ ‘‘గామా’’ రేడియేషన్ స్థాయిలు కనుగొనబడినట్లు ఉక్రెయిన్ అణుశక్తి నియంత్రణా సంస్థ తెలిపింది. శుక్రవారం చెర్నోబిల్ జోన్‌లో రేడియేషన్ స్థాయిలు ఎక్కువగా వున్నట్లు గుర్తించామని చెప్పిన ఏజెన్సీ.. ఎంత పెరిగిందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే భారీ ఎత్తున సైనిక సామాగ్రిని తరలించడం.. గాలిలోకి కలుషితమైన రేడియో ధార్మిక ధూళిని విడుదల చేయడం వల్ల ఇది జరిగి వుండొచ్చని ఏజెన్సీ పేర్కొంది. గురువారం భీకర యుద్ధం తర్వాత చెర్నోబిల్ ప్లాంట్ , దాని పరిసర ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకుంది.
రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మేజర్ ఇగోర్ కొనాషెంకోవ్ మాట్లాడుతూ.. రష్యా వైమానిక దళాలు కవ్వింపు చర్యలను నిరోధించేందుకు ప్లాంట్‌ను పరిరక్షిస్తున్నాయని చెప్పారు. ఆ ప్రాంతంలో రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే వున్నాయని ఆయన తేల్చిచెప్పారు. వియన్నాకు చెందిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ టేకోవర్ గురించి ఉక్రెయిన్ చెప్పిందని .. ఆ ప్రదేశంలో ఎలాంటి ప్రాణనష్టం కానీ, విధ్వంసం కానీ జరగలేదని పేర్కొంది. కీవ్‌కు ఉత్తరాన 130 కిలోమీటర్ల దూరంలో వున్న ప్లాంట్‌లోని న్యూక్లియర్ రియాక్టర్ పేలిపోయింది.
ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర అణు ప్రమాదాలో సోవియట్ రష్యాలోని చెర్నోబిల్ దుర్ఘటన ఒకటి. అణు విద్యుత్ కేంద్రంలో 1986 ఏప్రిల్ 25 అర్ధరాత్రి దాటాక భద్రతను పరీక్షించేందుకు చేపట్టిన ప్రయోగం విఫలమవడంతో ప్రమాదం సంభవించింది. విద్యుత్ సరఫరా ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసేందుకు ఇంజినీర్లు కీలక ప్రయోగాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా అణు విద్యుత్ కేంద్రంలోని నాలుగో నంబరు రియాక్టర్‌లో కొన్ని వ్యవస్థలకు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ప్రయోగం చేపట్టడానికి ముందు, రియాక్టర్ అప్పటికే అస్థిరంగా పనిచేస్తోందన్న విషయం ఇంజినీర్లకు తెలియదు.
చెర్నోబిల్ నుంచి వెలువడిన రేడియో ధార్మికతతో కూడిన పొగ, దుమ్ము, ధూళి వ్యర్థాలు గాల్లో కలిసిపోయి యూరప్ వ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్ల మేర విస్తరించాయి. చెర్నోబిల్ నాటి సోవియట్ యూనియన్‌లో భాగమైన ప్రస్తుత ఉక్రెయిన్‌లోని ఉత్తర ప్రాంతంలో ఉంది. ప్రమాదం అనంతరం అణు విద్యుత్ కేంద్రానికి సమీప ప్రాంతాల నుంచి దాదాపు లక్షా 16 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రేడియోధార్మికత వల్ల 134 మంది తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 28 మంది కొన్ని నెలల్లోనే చనిపోయారు. ఆ తర్వాత మరో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం నేపథ్యంలో అణు విద్యుత్ కేంద్రానికి 30 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని ప్రవేశ నిషేధ ప్రాంతం (ఎక్స్‌క్లూజన్ జోన్)గా ప్రకటించారు. తర్వాత మరింత ప్రాంతాన్ని దీని పరిధిలోకి తీసుకొచ్చారు. కొన్ని నెలల తర్వాత 2.34 లక్షల మందిని చెర్నోబిల్ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
రష్యా ఆక్రమణ నేపథ్యంలో.. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్, చుట్టుపక్కల ప్రాంతాలలో పెరుగుతున్న ఆందోళనతో ఇటీవలి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాను అని చెప్పాడు. కోర్టు పరిధిని ఉక్రెయిన్ అంగీకరించిందని కరీంఖాన్ పేర్కొన్నారు. తన కార్యాలయం 2014 ఫిబ్రవరి 20 నుంచి ఉక్రెయిన్ భూభాగంలో జరిగిన మారణ హోమం, మానవహక్కులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధ నేరాలపై తన అధికార పరిధిని వినియోగించుకోవచ్చని కరీంఖాన్ అన్నారు. ఉక్రెయిన్, రష్యాలు ఇంటర్నేషనల్ కోర్టులో సభ్యదేశాలు కానందున .. ఈ సంఘర్షణలో కలగజేసుకునే అధికార పరిధి తన కార్యాలయానికి లేదని ఖాన్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అనేది.. శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటైన యుద్ధ నేరాల కోర్ట్. స్థానిక అధికారులు విచారణ జరపలేని.. లేదా ఇష్టపడని దేశాలలో నేరాలను విచారించడానికి 2002లో దీనిని ఏర్పాటు చేశారు.
