ఉక్రెయిన్, రష్యాల మధ్య చర్చలు ప్రారంభం అయ్యాయి. బెలారస్ సరిహద్దు వేదికగా ఇరు దేశాలకు చెందిన ప్రతినిధుల బృందాలు చర్చలు జరుపుతున్నాయి.

ఉక్రెయిన్, రష్యాల మధ్య చర్చలు ప్రారంభం అయ్యాయి. బెలారస్ సరిహద్దు వేదికగా ఇరు దేశాలకు చెందిన ప్రతినిధుల బృందాలు చర్చలు జరుపుతున్నాయి. రష్యాతో చర్చల ప్రధాన లక్ష్యం తక్షణ కాల్పుల విరమణ అని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. కాల్పులను విరమించడంతో పాటుగా.. రష్యన్ దళాలను ఉపసంహరించాలని ఉక్రెయిన్ పట్టుబడుతుంది. మరోవైపు పలు ఒప్పందాలకు ఉక్రెయిన్ ఆమోదం తెలపాలని రష్యా కోరుతుంది. నాటోలో చేరబోమని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని ఉక్రెయిన్‌ను రష్యా పట్టుబడుతుంది.

అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఉక్రెయిన్‌ను రష్యా చర్చలకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ఓ వైపు యుద్దం చేస్తూనే.. మరోవైపు చర్చలకు సిద్దమని తెలిపింది. అయితే బెలారస్ వేదికగా చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తొలుత అంగీకరించలేదు. ఆ తర్వాత మనసు మార్చుకున్న జెలెన్ స్కీ చర్చలు జరిపేందుకు సిద్దమయ్యారు. ఉక్రేయిన్- బెలారస్ సరిహద్దులోని Prypiat నది సమీపంలో చర్చలు జరిపేందుకు అంగీకరించారు. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. 

ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం నేటితో ఐదో రోజుకు చేరుకుంది. ఇరు దేశాలకు ఇది తీరని నష్టాన్నే మిగిలిస్తుంది. ఈ తరుణంలో ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య చర్చలు జరగనుండటంతో అన్ని దేశాలు దీనిపై దృష్టి సారించాయి. ఈ చ‌ర్చ‌లు ఈ యుద్ధానికి ముగింపు ప‌లుకుతాయా? లేకుంటే మ‌రింత ఉద్రిక్త‌ల‌కు దారి తీస్తాయా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. 

ఇక, ఉక్రెయిన్, రష్యాల మధ్య చర్చలకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) కీలక వ్యాఖ్యలు చేశారు. తామంతా పోరాట యోధులం అని అన్నారు. రష్యా సైన్యానికి జెలెన్ స్కీ వార్నింగ్ ఇచ్చారు. రష్యా సైనికులు ప్రాణాలతో ఉండాలంటే వెంటనే తమ దేశం విడిచి వెళ్లాలని హెచ్చరించారు. రష్యా వ్యతిరేక పోరాటంలో పాల్గొనేందుకు సైనిక అనుభవం ఉన్న ఖైదీలను విడుదల చేస్తామని చెప్పారు. తమ దేశానికి వెంటనే యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు 4,500 మంది రష్యన్ సైనికులు మరణించారని జెలెన్ స్కీ చెప్పారు.

ఇక, ఐదు రోజులలో ఇప్పటివరకు రష్యా దాడిలో 14 మంది పిల్లలతో సహా 352 మంది పౌరులు మరణించారని ఉక్రేనియన్ అంతర్గత మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. 116 మంది పిల్లలతో సహా 1,684 మంది గాయపడ్డారని తెలిపింది.