ఉక్రెయిన్ రాజధాని కైవ్ లో నెలకొన్న భీకర పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ ఓ వీడియో విడుదల చేశారు. దేశ స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి తామంతా ఇక్కడే ఉన్నామని చెప్పారు. ఈ వీడియోలో ఆయనతో పాటు దేశ ముఖ్య అధికారులు, నాయకులు కనిపిస్తున్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ ( Volodymyr Zelensky) శుక్రవారం సెంట్రల్ కైవ్ నుండి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు, రష్యా (russia) దండయాత్రకు వ్యతిరేకంగా రాజధానిని రక్షించడానికి కీలక సహాయకులతో కలిసి ఆయ‌న ప్రతిజ్ఞ చేశారు.

‘‘ మేమంతా ఇక్కడ ఉన్నాము. మా మిలిటరీ ఇక్కడ ఉంది. సమాజంలోని పౌరులు ఇక్కడ ఉన్నారు. మనమందరం ఇక్కడ మన స్వాతంత్రం, మన దేశాన్ని కాపాడుకుంటున్నాం. అది అలాగే ఉంటుంది.’’ అని జెలెన్ స్కీప్రెసిడెన్సీ భవనం వెలుపల నిలబడి చెప్పారు. ఈ సమయంలో ఆయన ఆలివ్ ఆకుపచ్చ, మిలిటరీ తరహా దుస్తులు ధరించి ఉన్నారు. ఆయ‌న ప‌క్క‌నే ప్రధాన మంత్రి, చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఇతర సీనియర్ సహాయకులు నిల‌బ‌డి ఉన్నారు. 

శుక్రవారం కైవ్ (Kyiv)లో మొదటిసారిగా ఉక్రేనియన్ దళాలతో రష్యా దళాలు కొద్దిసేపు ఘర్షణ పడ్డాయి. ర‌ష్యా బ‌ల‌గాలు కైవ్ పై దాడి చేశాయి. వైమానిక దాడులు చేసే అవ‌కాశం కూడా ఉంది. ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను గురువారం నాడు ప్రారంభించింది. కొన్ని వారాలుగా ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ పరిష్థితి గురువారం నాడు మిలటరీ ఆపరేషన్ (military operation)కు దారి తీసింది. ఇదిలా ఉండ‌గా.. మాస్కో నుంచి ప్ర‌సంగించిన ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ జెలెన్స్కీ ప్రభుత్వాన్ని ‘‘ఉగ్రవాదులు, మాదకద్రవ్యాల బానిసలు, నియో-నాజీల ముఠా ’’ అని అభివర్ణించారు.

శుక్రవారం ఉద‌యం సమయంలో ర‌ష్యాకు, ఉక్రెయిన్ కు భీక‌రంగా యుద్ధం జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆ దేశ సైనిక అధికారులు దేశాధ్యక్షుడు జెలెన్ స్కీని బంకర్‌లోకి తరలించినట్టు వార్తలు వ‌చ్చాయి. ఆయ‌న‌ను కాపాడుకోవ‌డానికి భద్రతా దళాలు ఆయన్ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు క‌థనాలు వెలువ‌డ్డాయి. అయితే వీటిని జెలెన్ స్కీ ఖండిచారు. తాను ఎక్క‌డికీ వెళ్ల‌లేద‌ని, క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలతోనే ఉంటానని జెలెన్ స్కీ ప్రకటించారు. రష్యా దాడుల్ని ఉక్రెయిన్ Army ప్రతిఘటిస్తుందని జెలెన్ స్కీ తెలిపారు. అయితే తాము యుద్ధంలో ఒంటరైపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి ఎలాంటి సాయాన్ని ఆశించవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే, తాము మాత్రం రష్యాను చూసి భయపడట్లేదని, పోరాడుతామని, దేశాన్ని కాపాడుకుంటామని స్పష్టం చేశారు.