ఉక్రెయిన్ పై రష్యా దాడి ఆపడం లేదు. దీంతో రెండు దేశాల మధ్య భీకర పోరు నడుస్తోంది. రష్యా దాడికి ఉక్రెయిన్ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే ఉక్రెయిన్ లొంగిపోతే తాము దాడిని విరమిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. 

ఉక్రెయిన్ (Ukraine)పై ర‌ష్యా (Russia) దాడి కొన‌సాగుతోంది. రోజు రోజుకు రెండు దేశాల మ‌ధ్య పోరు పెరుగుతోంది. ర‌ష్యా సైన్యానికి ఉక్రెయిన్ సైన్యం ధీటుగా బ‌దులిస్తోంది. అయితే ఈ యుద్దం వ‌ల్ల రెండు దేశాల‌కు తీవ్ర ఆస్తి న‌ష్టం జ‌రుగుతోంది. రెండు వైపులా ప్రాణన‌ష్టం జ‌రుగుతోంది. అమాయ‌కులైన ప్రాణాలు పోతున్నాయి. యుద్దం ఆపేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌వుతున్నాయి. ఉక్రెయిన్ పై దాడులు ఆపాల‌ని రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ (putin)కు ఎవ‌రు సూచించినా ఆ మాట‌ల‌ను ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. దీంతో ఉక్రెయిన్ అల్లాడిపోతోంది. 

అయితే ఉక్రెయిన్ లొంగిపోవాల‌ని వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. ఆ దేశం లొంగిపోతే త‌ప్పా దాడులు ఆప‌బోమని తేల్చిచెప్పారు. అప్ప‌టి వ‌ర‌కు యుద్ధం కొనసాగుతూనే ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. కాగా రష్యా దళాలు ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకోవడంతో ఆ దేశం నుంచి ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని పారిపోయిన శరణార్థుల సంఖ్య ఇప్ప‌టి వ‌ర‌కు 1.5 మిలియన్లు దాటింది. పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనల కారణంగా ముట్టడిలో ఉన్న మారియుపోల్ (Mariupol) నగరం నుండి పౌరులను తరలించే ప్రయత్నాలు ఈరోజు రెండోసారి విఫలమయ్యాయి. అక్క‌డే ఉండిపోయిన నగరవాసులు కరెంటు, నీరులేక అవస్థలు పడుతున్నారు.

మైకోలైవ్ వెలుపల రష్యన్ దళాలతో ‘‘భీకరమైన యుద్ధాలు‘‘ జరుపుతున్నట్లు ఉక్రెయిన్ సైన్యం పేర్కొంది. రష్యా క్షిపణుల ధాటికి సెంట్రల్ ఉక్రెయిన్‌లోని విన్నిట్సియా విమానాశ్రయం ధ్వంసం అయినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelensky) తెలిపారు. ఇర్పిన్ (Irpin) నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు పౌరులు మోర్టార్ కాల్పుల్లో మరణించారని BBC నివేదించింది.

ఉక్రెయిన్ ర‌ష్యాకు మ‌ధ్య నెల‌కొన్న యుద్ధ ప‌రిస్థితుల వ‌ల్ల గ్లోబల్ స్ట్రీమింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix), అగ్ర అకౌంటింగ్ సంస్థలు KPMG, PWC, ఆర్థిక సేవల సంస్థ అమెరికన్ ఎక్స్‌ప్రెస్ (American Express ) అన్నీ రష్యాతో సంబంధాలను తెంచుకున్నాయి. అయితే పాశ్చ‌త్య దేశాల ఆంక్షల కారణంగా బ్లాక్ మార్కెట్ పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఊహాగానాలు వ‌స్తుండ‌టంతో దీనిని ఎదుర్కొనేందుకు ఆహార పదార్థాల అమ్మకాలను పరిమితం చేయాలని రష్య‌న్ లోని దుకాణాలకు అక్క‌డి ప్ర‌భుత్వం సూచించింది. 

ఉక్రెయిన్‌పై ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్న దండయాత్రకు వ్యతిరేకంగా రష్యా వ్యాప్తంగా ఆదివారం నిర‌స‌న‌లు చేప‌ట్టారు. అయితే ఈ నిర‌స‌న‌లు తెలిపిన వారిలో 4,600 మందికి పైగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉక్రెయిన్ పై యుద్దం వ‌ద్ద‌ని ఆ దేశ‌స్తులు చాలా కాలం నుంచి కోర‌కుంటున్నారు. యుద్దం మొద‌లైన నాటి నుంచి, అంత‌కంటే ముందు నుంచే ఆ దేశ‌స్తులు నిర‌స‌న‌లు చేప‌డుతున్నారు. 

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌తో ‘‘చర్చల ద్వారా లేదా యుద్ధం ద్వారా’’ తన లక్ష్యాలను సాధిస్తానని తేల్చిచెప్పారు. కాగా ఉక్రెయిన్, రష్యాలు సోమవారం మూడో రౌండ్ చర్చలు జరిపేందుకు అవకాశం ఉంది. అయితే నేడు ఐక్యరాజ్యసమితి (UNO) ఉన్నత న్యాయస్థానాన్ని ఉక్రెయిన్ ఆశ్ర‌యించ‌నుంది. వెంట‌నే త‌మ దేశంపై రష్యా దాడిని ఆపాల‌ని అత్యవసర తీర్పును జారీ చేయాల‌ని న్యాయ‌స్థానాన్ని కోర‌నుంది.