దేశం కోసం ఆ నటుడు ఆయుధం చేతబట్టాడు. కష్టాల్లో ఉన్న తన దేశాన్ని కాపాడుకునేందుకు ఆర్మీలో చేరాడు. మాతృభూమి రుణం తీర్చుకునే క్రమంలో రణరంగంలో అమరుడయ్యాడు. రష్యా జరిపిన కాల్పుల్లో ఆయన వీర మరణం పొందాడు. అయితే ఆయన చనిపోకముందు సోషల్ మీడియాలో చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. 

ఉక్రెయిన్ (Ukraine)కు, ర‌ష్యా (Russia)కు మధ్య వార్ కొన‌సాగుతుంది. పుతిన్ (putin) సైన్యం ఉక్రెయిన్ పై భీక‌ర దాడులు కొన‌సాగిస్తోంది. అయితే వీటిని జెలెన్ స్కీ (Zelenskyy) సేన‌లు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. ఎక్క‌డ చూసినా బాంబుల మోత‌లు వినిపిస్తున్నాయి. అంద‌మైన భ‌వ‌నాలు నేల‌కూలిపోతున్నాయి. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌కృతి ర‌మ‌ణీయంగా ఉన్న ప్రాంతాల‌న్నీ..బుల్లెట్ల గాయాల‌తో క‌నిపిస్తున్నాయి. యుద్దం ఆపేందుకు వివిధ దేశాలు చేసిన ప్ర‌య‌త్నాలు ఏవీ ఫ‌లించ‌లేదు. 

ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడిని ఆపేందుకు అమెరికాతో పాటు ప‌లు దేశాలు ఐక్య‌రాజ్య స‌మ‌తి ద్వారా చేసిన ప్ర‌య‌త్నాలను పుతిన్ ప‌ట్టించుకోలేదు. యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి (UN Security council) లో ర‌ష్యాకు వ్య‌తిరేకంగా తీర్మాణం ఆమోదం పొందిన ఆ దేశానికి ఉన్న ప్ర‌త్యేక వీటో అధికారాల వ‌ల్ల అది వీగిపోయింది. ఉక్రెయిన్ కు, ర‌ష్యాకు మూడు సార్లు శాంతి చ‌ర్చ‌లు జ‌రిగినా అవి విజ‌య‌వంతం కాలేదు. దీంతో దాడి కొన‌సాగుతూనే ఉంది. అయితే మూడో స‌మావేశంలో సాధార‌ణ పౌరుల‌కు ఎలాంటి హానీ క‌లగ‌కుండా ఉండేందుకు ర‌ష్యా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. పౌరుల‌ను సురక్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించేంత వ‌ర‌కు మ‌న‌వతా దృక్ప‌థంతో కాల్పుల విర‌మ‌ణ చేస్తామ‌ని హామీ ఇచ్చింది. దీంతో చాలా మంది వివిధ దేశాల పౌరులు సుర‌క్షిత ప్రాంతాల‌కు చేరుకున్నారు. ఇందులో మ‌న దేశానికి చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. 

ర‌ష్యా త‌న దాడుల‌ను ఆప‌క‌పోవ‌డంతో ఉక్రెయిన్ తీవ్రంగా న‌ష్ట‌పోతోంది. చిన్న దేశం కావ‌డంతో సైనిక బ‌ల‌గం కూడా త‌క్కువ‌గానే ఉంది. దీంతో యుద్ధం మొద‌లైన రెండో రోజే ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ ఓ ఉద్వేగ‌పూరిత ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ దేశానికి ఎవ‌రూ స‌హ‌క‌రించ‌డం లేద‌ని, తాము యుద్ధంలో ఒంటరి అయిపోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయినా యుద్ధం ఆప‌బోమ‌ని, సాధార‌ణ పౌరుల‌కు ఆయుధాలు ఇస్తామ‌ని, ర‌ష్యా సేన‌ల‌తో పోరాడాల‌ని సూచించారు. ఆ పిలుపున‌కు ఉక్రెయిన్ లో పౌరులు స్పందించి ఆయుధాలు చేత‌బ‌ట్టారు. అందులో భాగంగానే ఓ యువ న‌టుడు పాషాలీ (33) (Pasha Lee) కూడా సాయుధ ద‌ళాల‌తో చేరారు. అయితే ఆయ‌న యుద్ధంలో ప్రాణాలు విడిచారు. 

యుద్ధంలో మృతి చెందిన నటుడు పాషాలీ సోష‌ల్ మీడియాలో చేసిన చివ‌రి పోస్టు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారుతోంది. అందులో ఏం ఉందంటే.. ‘‘ నా దేశాన్ని కాపాడుకునేందుకు నా వంత పోరాటం నేను నిర్వహిస్తున్నాను. గ‌డిచిన 48 గంటలుగా నేను డ్యూటీలో ఉన్నాను. అయితే ప్ర‌స్తుతం ఈ ప్రాంతంలో ఏం జ‌రుగుతుందో తెలిపేందుకు నాకు కూర్చొని ఫొటో తీసుకునే ఛాన్స్ ల‌భించింది. మేం మా దేశం కోసం పోరాటం చేయ‌గ‌ల‌ము. ఏదైనా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే మేము హాయిగా న‌వ్వుతున్నాము. మేము దేశం కోసం ప‌ని చేస్తున్నాము.’’ అంటూ ఆర్మీ డ్రెస్ లో ఉన్న ఫొటోను ఆయ‌న షేర్ చేస్తూ పోస్టు పెట్టారు. అది ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారుతోంది. 

పాషాలీ క్రిమియా ( Crimea) లో జ‌న్మించారు. ఆయ‌న మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రష్యా దళాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆ దేశ టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్స్‌లో చేరాడు. ఉక్రెయిన్ నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ప్రెసిడెంట్ సెర్గి టోమిలెంకో, ఒడెస్సా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆయ‌న మ‌ర‌ణ వార్త‌ను ధృవీకరించింది.