ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను బ్యాచ్ ల వారీగా ఇండియాకు తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా నేడు మొదటి బ్యాచ్ సుసెవా సరిహద్దు క్రాసింగ్ ద్వారా రొమేనియాకు చేరుకుంది. అక్కడి నుంచి బూకారెస్ట్ కు వచ్చి విమానం ద్వారా మన దేశానికి రానున్నారు.
ఉక్రెయిన్ (ukraine)లో చిక్కుకున్న ఇండియన్ స్టూడెంట్ల (indian students)ను క్షేమంగా తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఉక్రెయిన్ గగనతలంపై విమానాల రాకపోకలపై నిషేధం విధించడంతో ఆ దేశంలో ఉన్న మన పౌరులు ఇబ్బందుల్లో పడ్డారు. ప్రస్తుతం అక్కడ భీకర పరిస్థితులు నెలకొన్నాయి. విమనాలు రద్దు కావడంతో వారంతా అక్కడ చిక్కుకుపోయారు. వారికి ప్రస్తుతం ఇండియన్ ఎంబసీ (indian embassy) రక్షణ కల్పిస్తోంది.
ఇండియన్ ఎంబసీ (indian embassy) రక్షణలో ఉన్న స్టూడెంట్లను భారత్ కు తీసుకొచ్చేందుకు కొత్త మార్గాన్ని అధికారులు అన్వేషించారు. ప్రస్తుతం రొమేనియా (Romania) రాజధాని బుకారెస్ట్ (Bucharest) వరకు విమనాల రాకపోకలకు అనుమతి ఉంది. దీంతో అక్కడ ఉన్న స్టూడెంట్లను రోడ్డు మార్గం ద్వారా బుకారెస్ట్ కు తీసుకొచ్చి అక్కడి నుంచి ఇండియాకు తీసుకురావాలని నిర్ణయించారు. అందులో భాగంగా నేడు మొదటి బ్యాచ్ శుక్రవారం మధ్యాహ్నం సుసెవా సరిహద్దు పోస్ట్‌ను దాటి రొమేనియా చేరుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
‘‘ఉక్రెయిన్ నుండి తీసుకొస్తున్న మొదటి బ్యాచ్ సుసెవా సరిహద్దు క్రాసింగ్ ద్వారా రొమేనియాకు చేరుకుంది. సుసెవాలోని మా బృందం ఇప్పుడు వారిని బూకారెస్టుకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అక్కడ నుంచి వారు ఇండియాకు వస్తారు ’’ అని MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి (arindam bagchi) తెలిపారు. దీంతో పాటు ఆయన భారతీయులు రవాణా చేస్తున్న ఫొటోలను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి భారతీయులను తరలించేందుకు ఎయిర్ ఇండియా రెండు విమానాలను నడుపుతుందని సీనియర్ అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని విమానాలు నడిపే అవకాశం ఉంది. ఈ రెండు ఎయిరిండియా విమానాలు శనివారం బుకారెస్ట్ నుండి బయలుదేరే అవకాశం ఉంది. రష్యా సైనిక దాడితో ఉక్రెయిన్ ప్రభుత్వం ఆ దేశ గగనతలాన్ని మూసివేసిన తర్వాత హంగేరి, పోలాండ్, స్లోవేకియాతో ఉక్రెయిన్ భూ సరిహద్దుల గుండా భారత్ తన పౌరులను ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తోంది.
అంతకు ముందు ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం 470 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌ను విడిచిపెట్టి శుక్రవారం పోరుబ్నే-సిరెట్ (Porubne-Siret) సరిహద్దు ద్వారా రొమేనియాలోకి ప్రవేశిస్తారని భారత ప్రభుత్వం తెలిపింది. ఉక్రెయిన్ (Ukraine), పోలాండ్ (Poland), రొమేనియా (Romania), హంగేరీ (Hungary) లోని భారత రాయబార కార్యాలయాల సంయుక్త ప్రయత్నాల ద్వారా భారీ తరలింపు ఆపరేషన్ నిర్వహిస్తున్నామని పేర్కొంది.
భారతదేశానికి చెందిన దాదాపు 16,000 మంది పౌరులు, స్టూడెంట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా (Dmytro Kuleba)తో ఫోన్ లో మాట్లాడారు. భారతీయ పౌరులు పడుతున్న ఇబ్బందుల గురించి చర్చించారు. అక్కడి పౌరులు సురక్షితంగా తిరిగి రావడానికి ఆయన అందిస్తున్న మద్దతును ప్రశంసించారు. కాగా.. గురువారం ఉక్రెయిన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం.. ఉక్రెయిన్ ఆంక్షల నేపథ్యంలో మధ్యలో నుంచే తిరిగి వచ్చింది. ప్రస్తుతం బుకారెస్ట్ వద్ద నుంచి విమానయాన సర్వీసులకు అనుమతి ఉండటంతో అక్కడ నుంచి విద్యార్థులను తీసుకురానుంది.
