ఉక్రెయిన్ (ukraine) రాజధాని కీవ్‌ను (kyiv) రష్యా బలగాలు (russian army) సమీపిస్తున్నాయి. ఉక్రెయిన్ ప్రభుత్వ భవనాలను ఆధీనంలోకి తీసుకోవాలనే యోచనలో రష్యా వుంది. ఉక్రెయిన్‌లో 11 వైమానిక స్థావరాలు ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. 

ఉక్రెయిన్ (ukraine) రాజధాని కీవ్‌ను (kyiv) రష్యా బలగాలు (russian army) సమీపిస్తున్నాయి. ఉక్రెయిన్ ప్రభుత్వ భవనాలను ఆధీనంలోకి తీసుకోవాలనే యోచనలో రష్యా వుంది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించింది నాటో (nato) . ఉక్రెయిన్ ప్రజలకు ప్రభుత్వానికి అండగా వుంటామని నాటో పేర్కొంది. రష్యా సైనిక చర్య ఆపాలని నాటో కూటమి కోరింది. రష్యా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని హెచ్చరించింది. రష్యా చర్యల వల్ల యూరో- అట్లాంటిక్ భద్రతకు విఘాతం కలుగుతుందని నాటో తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్‌లో 11 వైమానిక స్థావరాలు ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. 

మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. కేంద్ర హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. యుద్ధంతో నెలకొన్న పరిణామాలు, భారత్‌పై తక్షణ ప్రభావం చేపట్టాల్సిన చర్యలపై ప్రధాని మోడీ చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ రాత్రికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో (vladimir putin) మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అంతకుముందు రష్యా దాడులతో పరిస్థితులు చేజారుతోన్న వేళ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) సంచలన ప్రకటన చేశారు. ఆయుధాలిస్తాం, దేశం కోసం పోరాడాలని పౌరులకు పిలుపునిచ్చారు. దేశం కోసం పోరాడాలనుకునేవారికి తాము ఆయుధాలిస్తామని.. ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని జెలెన్‌స్కీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా అనేక మంది సామాన్య పౌరులకు ఉక్రెయిన్‌ సైనికులు ఆయుధాల్లో శిక్షణ ఇచ్చిన విషయం తెలిసిందే. దేశాన్ని కాపాడుకోవడం కోసం యుద్ధం చేయడానికైనా రెడీ అంటూ చిన్నారుల నుంచి వృద్ధుల వరకు శిక్షణ తీసుకున్నారు. 

మరోవైపు.. రష్యా చేస్తోన్న వైమానిక దాడుల్లో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 40 మంది ఉక్రెయిన్‌ సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారని అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సంఖ్య వందల్లోనే ఉండొచ్చని సమాచారం. ఇప్పటికే అనేక నివాస ప్రాంతాలపై రష్యా వైమానిక దాడులు జరిపిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. రష్యా బలగాలు సరిహద్దులను దాటి ఉక్రెయిన్‌ భూభాగంలోకి చేరుకున్నాయి. అయితే, తమ భూభాగంలోకి ప్రవేశించిన 50 మంది రష్యన్‌ సిబ్బందిని హతమార్చినట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది. అయితే..ఉక్రెయిన్‌ ప్రకటనను రష్యా ఖండించింది.