ఉక్రెయిన్ రాజధాని కైవ్ లో ప్రస్తుతం అమలవుతున్న కర్ఫ్యూ సమయాన్ని పొడగించారు. సాయత్రం 5 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు తీవ్ర కర్ఫ్యూ విధిస్తున్నట్టు మేయర్ తెలిపారు. ప్రస్తుతం ఈ టైమింగ్ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉంది. 

ఉక్రెయిన్ (Ukraine) రాజ‌ధాని కైవ్ (Kyiv) మేయర్ లో తీవ్ర క‌ర్ఫ్యూ (curfew) విధిస్తున్న‌ట్టు విటాలీ క్లిట్ష్కో ( Vitaly Klitschko) శనివారం ప్ర‌క‌టించారు. రష్యా దళాలు కైవ్ పై దాడిని కొన‌సాగిస్తుండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేరకు క్లిట్ష్కో టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో కర్ఫ్యూ వివ‌రాలు వెల్ల‌డించిన‌ట్టు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. ‘‘కర్ఫ్యూ సమయంలో వీధిలో ఉన్న పౌరులందరూ శత్రువుల విధ్వంసం, నిఘా సమూహాలలో సభ్యులుగా పరిగణించబడతారు’’ అని క్లిట్ష్కో చెప్పారు. అలాగే కర్ఫ్యూ సమయాన్ని సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 8 గంటల పెంచారు. ఇది గ‌తంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కొనసాగింది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelenskyy) శనివారం మీడియాతో మాట్లాడారు. తాను భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో మాట్లాడానని, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తమకు రాజకీయ మద్దతు ఇవ్వాలని భారత్‌ను కోరారు. ఉక్రెయిన్ బలగాలు విజయం సాధిస్తాయని ధీమా వ్య‌క్తం చేశారు. “మా మిలిటరీ, మా నేషనల్ గార్డ్, మా నేషనల్ పోలీస్, మా టెరిటరీ డిఫెన్స్, స్పెషల్ సర్వీస్, ఉక్రెయిన్ జాతీయులకు ఒక విష‌యం చెప్పాల‌నుకుంటున్న. దయచేసి పోరాటం కొనసాగించండి. మ‌న‌మే గెలుస్తాము.’’ అని పేర్కొన్నారు. శత్రు దాడులను విజయవంతంగా అడ్డుకుంటున్నామని ఆయన తెలిపారు. ‘‘ మనం మన నేలను, మన పిల్లల భవిష్యత్తును రక్షించుకుంటున్నామని మనకు తెలుసు. కైవ్, కీలక ప్రాంతాలు మన సైన్యం నియంత్రణలో ఉన్నాయి. కబ్జాదారులు వారి కీలుబొమ్మను మన రాజధానిలో ఏర్పాటు చేసుకోవాలన్నారు. కానీ వారు విజయవంతం కాలేరు” అని ఆయ‌న వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉండ‌గా.. రష్యా దాడిలో 198 మంది మరణించారని, 1,000 మందికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ ఆరోగ్య మంత్రి విక్టర్ లియాష్కో (Viktor Lyashko) శనివారం తెలిపారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని ఆయ‌న చెప్పారు. మృతుల్లో సైనికులు, పౌరులు కూడా ఉన్నారా అనే విష‌యాన్ని ఈ ప్ర‌క‌ట‌న స్ప‌ష్టం చేయలేదు. గురువారం ప్రారంభమైన రష్యా దాడిలో 33 మంది చిన్నారులు సహా మరో 1,115 మంది గాయపడ్డారని ఆయన చెప్పారు. శనివారం కైవ్ వీధుల్లో పోరాటం కొనసాగుతున్న స‌మ‌యంలోనే ఈ ప్రకటన వెలువడింది. నగరంలో రాత్రిపూట షెల్లింగ్, పోరాటంలో ఇద్దరు పిల్లలతో సహా కనీసం 35 మంది గాయపడ్డార‌ని ది గార్డియన్ తాజాగా నివేదించింది.