ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని కొనసాగించడానికి రష్యా ప్రభుత్వం చైనా సహాయం కోరినట్టు తెలిసింది. తమకు ఆయుధాలు అందించి సహకరించాలని చైనాను కోరినట్టు అమెరికా శ్వేత సౌధ వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి విజ్ఞప్తి ఇదే తొలిసారి కాదని, ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించిన వెంటనే ఈ విజ్ఞప్తి చేసిందని తెలిపాయి.

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మూడో వారంలోకి చేరింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై బాంబులు వేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఒక్కొక్కటిగా ఉక్రెయిన్ నగరాలను ధ్వంసం చేస్తూ వస్తున్నది. అయితే, ఉక్రెయిన్‌పై యుద్ధం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఊహించిన దాని కంటే కూడా భారంగా మారినట్టు తెలుస్తున్నది. బహుశా అందుకే చైనాను ఆయుధ సహకారం కోరి ఉండవచ్చని కొందరు నిపుణులు చర్చిస్తున్నారు. ఔను.. ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగించడానికి చైనా నుంచి ఆయుధ సహకారాన్ని రష్యా కోరిందని అమెరికాలోని శ్వేతసౌధ వర్గాలు తెలిపాయి. తమ పేరు చెప్పడానికి నిరాకరించిన ఆ వర్గాలు రష్యా ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని గతంలోనూ చైనాకు చేసిందని పేర్కొన్నాయి. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ప్రారంభించిన వెంటనే చైనాను ఆయుధ సహకారం కోరిందని, ఇటవలే మరోసారి కోరిందని వివరించాయి.

అయితే, రష్యా అడుగుతున్న సహాయానికి చైనా ఏ విధంగా స్పందిస్తుంది అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఒక వేళ రష్యాకు ఆయుధ సహకారాన్ని అందించి 1972లో నిర్దేశించుకున్న విదేశాంగ విధానాన్ని మార్చుకోబోతుందా? లేక పాత విధానాన్నే కొనసాగిస్తుందా? అనేది తెలియాల్సి ఉన్నదని వివరించాయి.

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని చైనా ఇప్పటి వరకు ఖండించలేదు. కానీ, వెంటనే శాంతి ఒప్పందానికి రావాలని, దౌత్య మార్గాల్లో శాంతి అన్వేషించాలని చైనా పలుమార్లు సూచనలు చేసింది. అలాగనీ, రష్యాను సమర్థించింది లేదు. గతంలో ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియాను రష్యా ఆక్రమించుకోవడాన్ని చైనా ఖండించలేదు. అలాగనీ, సమర్థించనూ లేదు. అధికారికంగా తటస్థ వైఖరిని అవలంభించింది. తాజాగా, ఉక్రెయిన్‌పై దాడిపైనా చైనా ఇదే వైఖరిని కొనసాగిస్తున్నది.

నిజానికి చైనా కంటే రష్యాలోనే ఎక్కువ ఆయుధాల అభివృద్ధి ఉంటుంది. చైనా నుంచి రష్యా కొనుగోలు చేయడం.. కంటే విక్రయించుకోవడమే ఎక్కువ. కానీ, ఇటీవలి కాలంలో చైనా దాని ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుంది. మిలిటరినీ ఆధునీకరించుకుంది. ఈ నేపథ్యంలోనే అత్యాధునిక ఆయుధాలను చైనా అభివృద్ధి చేస్తున్నది.

ఒక వేళ చైనా ఆయుధాలను రష్యాకు అందిస్తే మాత్రం పశ్చిమ దేశాల ఆగ్రహాలకు గురికాక తప్పదు. ఇప్పటికే పలు ఆంక్షలు ఎదుర్కొంటున్న చైనా మరిన్ని కఠిన ఆంక్షలను ఎదుర్కోకతప్పదు. దీనికితోడు దేశీయంగానూ ఈ నిర్ణయం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు కీలకమైనదిగా పరిణమించింది. ఎందుకంటే.. ఈ ఏడాదిలోనే ఐదేళ్లకు ఒకసారి చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్వహించుకునే సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో జీ జిన్‌పింగ్ మరోసారి అధ్యక్ష పగ్గాలు నిలుపుకునే అవకాశాలు ఉన్నాయి. జీ జిన్‌పింగ్ ఇప్పటికే బలమైన నేతగా తన స్టేటస్ స్థాపించుకున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా నిజంగానే ఆయుధ సహకారానికి విజ్ఞప్తి చేసి ఉంటే.. ఆయన ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

రష్యా యుద్ధాన్ని ప్రారంభించిన తర్వాత అమెరికా, చైనా తొలి ఉన్నత స్థాయి భేటీ సమావేశం జరగనుంది. రష్యాను కట్టడి చేయడానికి చైనాపై ఒత్తిడి చేసే లక్ష్యంతో అమెరికా ఈ సమావేశంలో వ్యవహరించనుంది. ఇటలీలోని రోమ్‌లో వైట్ హౌజ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సలీవన్, చైనా టాప్ డిప్లమాట్, కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యాంగ్ జెయిచ‌లు భేటీ కాబోతున్నారు.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించడానికి ముందే చైనాకు దానికి సమాచారం ఉండి ఉండవచ్చని జేక్ సలీవన్ గతంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను చైనా కొట్టిపారేసింది.