Asianet News TeluguAsianet News Telugu

పది మంది పిల్లలకు జన్మనిస్తే.. రూ. 13 లక్షల ఆఫర్.. మహిళలకు స్కీమ్ ప్రకటించిన దేశ అధ్యక్షుడు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. దేశంలో జనాభాలో లోటుపాట్లను పూర్తి చేయడానికి ఎక్కువ మంది సంతానం కోసం మహిళలను ప్రోత్సహించారు. పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను జన్మ ఇస్తే.. పదో పిల్లాడి తొలి పుట్టిన రోజు తర్వాత ఒకే సారి సదరు ‘మదర్ హీరోయిన్‌’కు 13,500 పౌండ్లు ఇస్తామని ప్రకటించారు.
 

russia president vladimir putin to offer women to have ten or more children
Author
First Published Aug 18, 2022, 1:06 PM IST

న్యూఢిల్లీ: దేశ జనాభా కరిగిపోతున్నదని ఆ దేశ అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. మహిళలకు అనూహ్య ప్రకటన చేశారు. పిల్లలను కనాలని కోరారు. పది మంది పిల్లలను కనాలని, వారంతా సురక్షితంగా ఉంటే.. పదో పిల్లాడి తొలి పుట్టిన రోజున బంపర్ ఆఫర్ ఇస్తానని వెల్లడించారు. పది మంది పిల్లలు సురక్షితంగా ఉంటే గనక ఆ మహిళలకు సుమారు రూ. 13 లక్షలు ఆఫర్ చేస్తానని తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ప్రకటన చేసి సంచలనం సృష్టించారు.

రష్యా డెమోగ్రఫిక్ సంక్షోభం ఎదుర్కొంటున్నదని, జనాభా సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నాయని, సరైన రీతిలో సంఖ్య లేదని నిపుణులు చెబుతున్నారు. 1990వ దశాబ్దం నుంచే రష్యా జనాభా గురించిన ఆందోళనలు ఉన్నాయని, కరోనా, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మరణాలతో ఈ ఆందోళనలు మళ్లీ హెచ్చిందని వివరిస్తున్నారు.

ఈ లోటును పూడ్చడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. రష్యా జనాభాలో లోటుపాట్లను పూడ్చడానికి ఆయన పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని మహిళలను కోరారు. పది మంది పిల్లలను కని ఉంటే.. పదో సంతానం తొలి పుట్టిన రోజు పూర్తయిన తర్వాత ఒకే సారి పది లక్షల రూబుల్స్ (13,500 పౌండ్లు) ఇస్తామని ప్రకటించారు.

రష్యన్ పాలిటిక్స్, సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ డాక్టర్ జెన్సీ మాథర్స్ ఈ కొత్త రష్యన్ రివార్డు ప్రకటన గురించి బ్రాడ్‌కాస్టర్ హెన్రీ బొన్సుతో టైమ్స్ రేడియాలో మాట్లాడారు. ఈ స్కీమ్‌ను ‘మదర్ హీరోయిన్’ అని పిలుస్తునర్నారు. దేశ జనాభాలో లోటును తిరిగి నింపడానికి ఈ ప్రకటన చేశారని ఆయన వివరించారు. 

ఈ ఏడాది మార్చి తర్వాత అత్యధికంగా కరోనా వైరస్ కొత్త కేసులు రిపోర్ట్ అవుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. అంతేకాదు, ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా సైనికులు ఇప్పటి వరకు సుమారు 50 వేల మంది మరణించారు. ఎక్కువ మంది సభ్యులున్న కుటుంబం ఎక్కువ దేశ భక్తి కలిగి ఉంటున్నదని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెబుతున్నట్టు వివరించారు. 

సోవియెట్ కాలంలో పది మంది లేదా అంతకంటే ఎక్కువ మందికి జన్మనిస్తే.. వారిని మదర్ హీరోయిన్ అని పిలిచేవారని బోన్సు తెలిపారు. రష్యా డెమోగ్రఫిక్ క్రైసిస్‌ను ఎదుర్కోవడానికి ఈ ప్రకటన చేశారని చెప్పారు. కానీ, అధ్యక్షుడు పుతిన్ ప్రకటన చూస్తే.. జనాభా కోసం దేశం తీవ్రంగా తాపత్రాయపడుతున్నట్టు కనిపిస్తున్నది కదా? అని ప్రశ్నించారు.

ఔను.. ప్రభుత్వానికి ఆ విషయంలో కొంత ఆరాటం ఉన్నట్టు స్పష్టంగానే కనిపిస్తున్నదని డాక్టర్ మాథర్స్ అంగీకరించారు. 1990ల కాలం నుంచే జనాభా విషయంలో రష్యా ఆందోళనతో ఉన్నదని వివరించారు. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌తో యుద్ధం వంటి విషయాలు ఈ ఆందోళనలను మరింత పెంచి పోషించాయని తెలిపారు. కాబట్టి, పెద్ద కుటుంబాల కోసం.. మహిళలను ప్రోత్సహించడానికే ఈ ప్రకటన చేసినట్టు వివరించారు. కానీ, 13,500 పౌండ్ల కోసం పది మంది పిల్లలను కని పెంచి పోషించాలని ఎవరైనా భావిస్తారా? పది మంది పిల్లలను కనే కాలంలోని ఖర్చులనూ ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. అయితే, రష్యాలో అనేక ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలు ఉన్నాయని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios