తాము సోవియట్ యూనియన్ (soviet union) నుంచి విచ్ఛిన్నమైపోయినా ఇంకా అత్యంత శక్తిమంతమైన సామ్రాజ్యంగానే వున్నామని పుతిన్ గుర్తుచేశారు. తమ దగ్గర అత్యంత శక్తిమంతమైన అణ్వస్త్రాలు, ఇతర ఆయుధాలూ ఉన్నాయని గుర్తుంచుకోవాలని రష్యా అధినేత హెచ్చరించారు

ఉక్రెయిన్‌పై రష్యా దాడి (russia ukraine crisis) నేపథ్యంలో పుతిన్‌ను (putin) ఎదుర్కోవడానికి అమెరికా (america) సహా పాశ్చాత్య దేశాలు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రష్యాపై పలు ఆంక్షలు విధించాయి కూడా. నయానా భయానో పుతిన్‌ను దారికి తీసుకురావాలని అగ్రరాజ్యాలు పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగా రష్యాపై అణుదాడి జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. దీనికి పుతిన్ కూడా ధీటుగా బదులిచ్చారు. తమ వద్ద అణ్వాయుధాలున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ అమెరికాకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. 

తాము సోవియట్ యూనియన్ (soviet union) నుంచి విచ్ఛిన్నమైపోయినా ఇంకా అత్యంత శక్తిమంతమైన సామ్రాజ్యంగానే వున్నామని పుతిన్ గుర్తుచేశారు. తమ దగ్గర అత్యంత శక్తిమంతమైన అణ్వస్త్రాలు, ఇతర ఆయుధాలూ ఉన్నాయని గుర్తుంచుకోవాలని రష్యా అధినేత హెచ్చరించారు. ఎవరైనా అడ్డొస్తే వినాశకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. అంటే ఉక్రెయిన్ పై తమ దాడులకు ప్రతిగా తమ దేశంపై వేరే ఏ దేశమైనా సైనిక దాడికి దిగితే అణు దాడి (nuclear war) చేస్తామంటూ ఆయన పరోక్ష బెదిరింపులకు పాల్పడ్డారు. 

ఆ భయం వల్లే ఉక్రెయిన్‌కు మాట సాయం తప్ప సైనిక సాయం చేయలేమంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (joe biden) సైతం వెనకడుగు వేశారు. నాటో బలగాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా యుద్ధానికి దిగితే.. రష్యా, నాటో మధ్య అణ్వాయుధ యుద్ధం జరిగే ముప్పుంటుందని పుతిన్ ముందే ఊహించారు. వాస్తవానికి ఉక్రెయిన్‌ను తాము ఆక్రమించుకోవడానికి దాడి చేయడం లేదని, కేవలం డీ మిలటరైజేషన్ (నిస్సైనికీకరణ) కోసమేనని పుతిన్ చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు వేరేలా వున్నాయి. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత మళ్లీ రష్యాకు పునర్వైభవం తెచ్చేందుకే ఇలాంటి చర్యలకు పుతిన్ దిగుతున్నారని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ఇటు నాటోలో చేరకూడదంటూ స్వీడన్, ఫిన్లాండ్‌లనూ రష్యా తాజాగా హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు పట్టిన గతే పడుతుందంటూ బెదిరించింది. ఇప్పటికే రష్యా చుట్టూ ఉన్న దేశాల్లో నాటో బలగాల మోహరింపులు ఎక్కువైపోయాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ సహా రష్యాకు సరిహద్దుల్లో ఉన్న మరికొన్ని దేశాలనూ నాటోలో కలుపుకునేందుకు అమెరికా తాపత్రాయపడుతోంది. నాటోలో ఇన్ని దేశాలే ఉండాలన్న పరిమితులేం లేవని, ఎన్ని దేశాలైనా చేరొచ్చంటూ ఇటీవల ప్రకటన కూడా చేయడం గమనార్హం. ఈ పరిణామాల దృష్యా ఏ దేశాన్నీ తమపై దాడికి ఉసిగొల్పకుండా ఉండడం కోసమే పుతిన్ అణ్వాయుధ దాడి ప్రస్తావన తీసుకొచ్చారని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఆ వ్యాఖ్యలను అమెరికా, యూరప్ దేశాలు లైట్ గా తీసుకుంటే మాత్రం పరిస్థితి ఊహించడానికే దారుణంగా వుంటుందని అంటున్నారు.