Russia Earthquake : రష్యాను మరోసారి భూకంపం కుదిపేసింది. ఈశాన్య భాగంలోని కంచట్కా ద్వీపకల్పంలో 7.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీంతో అధికారులు సమీప తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరిక జారీ చేశారు.  

Russia Earthquake: రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. 7.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం రావడంతో సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఈశాన్య రష్యాలోని కంచట్కా ద్వీపకల్పం తీరంలో ఈ భూకంపం వచ్చింది. పెట్రోపావ్లోవ్స్క్-కంచట్స్కీకి 128 కిలోమీటర్ల తూర్పున, 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదించింది. ప్రస్తుతానికి ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. 

Scroll to load tweet…

భూకంపంపై రష్యా అధికారిక ప్రకటన 

"ప్రస్తుతానికి ప్రాణనష్టంపై ఎలాంటి నివేదికలు లేవు. అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నాను. ద్వీపకల్పం తూర్పు తీరంలో సునామీ హెచ్చరిక జారీ చేశాం. ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు అందిస్తున్నాం" అని గవర్నర్ వ్లాదిమీర్ సోలోడోవ్ తెలిపారు.

రష్యన్ స్టేట్ జియోఫిజికల్ సర్వీస్ ప్రాంతీయ విభాగం భూకంప తీవ్రతను 7.4గా నమోదు చేసింది. కనీసం ఐదు ప్రకంపనలు నమోదయ్యాయని తెలిపింది. సమీప తీర ప్రాంతాల్లో ప్రమాదకరమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని యూఎస్ పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది.

Scroll to load tweet…

భూకంపం ప్రాంతంగా కంచట్కా

పసిఫిక్ మహాసముద్రంలోని 'రింగ్ ఆఫ్ ఫైర్' అనే భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కంచట్కా ద్వీపకల్పం ఉంది. ఇది భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతం. జులైలో ఈ ప్రాంతంలో 8.8 తీవ్రతతో వచ్చిన పెద్ద భూకంపం సునామీకి కారణమైంది. అప్పుడు ఒక తీరప్రాంత గ్రామం సముద్రంలోకి కొట్టుకుపోయింది. ఇప్పుడు మళ్ళీ భూకంపం రావడంతో సునామీ భయం వెంటాడుతోంది.