Russian Ukraine Crisis: రష్యా విమానాలపై నిషేధం విధించిన నేపథ్యంలో బ్రిటన్, జర్మనీ సహా 36 దేశాలకు చెందిన విమానాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. రష్యా విమానయాన సంస్థలు ఇప్పుడు అత్యధిక మెజారిటీ యూరోపియన్ దేశాలతోపాటు కెనడా గగనతలంలోకి ప్రవేశించలేకపోవడంతో రష్యా ప్రకటన వెలువడింది. 

Russian Ukraine Crisis: ఉక్రెయిన్ ను ఆక్రమించాల‌నే కుతంత్రంతో ర‌ష్యా ఐదో రోజు కూడా దాడి చేస్తుంది. ఇప్ప‌టికే ప‌లు న‌గ‌రాల‌ను ర‌ష్యా ధ్వంసం చేసింది. రష్యా బ‌లాగాల‌ దాష్టీకంతో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎటుచూసినా.. బాంబు దాడులు, క్షిప‌ణుల ప్ర‌యోగాలు, వైమానిక దాడులతో భయానక దృశ్యాలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోన‌న్న భ‌యంతో ఉక్రెయిన్ పౌరులు.. ఎక్క‌డ ఆశ్ర‌యం దొరికితే.. అక్క‌డ త‌ల‌దాచుకుంటున్నారు. 

ఇప్ప‌టికే రష్యా దుశ్చ‌ర్య‌ను ప్ర‌పంచ దేశాలు త‌ప్పుప‌డుతున్నాయి. యుద్దాన్ని త‌క్షణ‌మే నిలిపివేయాల‌ని ప్ర‌పంచ‌దేశాలు కోరుతున్నాయి. ర‌ష్యా కుతంత్రాన్ని ఐక్య రాజ్య‌స‌మితి కూడా తీవ్రంగా ఖండిస్తోంది. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో సహా అనేక దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. రష్యా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆర్ధిక, దౌత్యపరమైన ఆంక్షలు సహకార, రవాణా, వ్యవస్థలపైనా రష్యా పై ఆంక్షలు విధించాయి.

రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పలు దేశాలు ఇటీవల రష్యా నుంచి తమ దేశాలకు వచ్చే విమానాలను నిషేధించాయి. అమెరికా సహా యూరోప్ లోని 16 దేశాలు రష్యా విమానాలపై నిషేధం విధిస్తు నిర్ణయం తీసుకున్నాయి. యురోపియన్ యూనియన్ దేశాలు సైతం రష్యా విమానాలను బహిష్కరించాల్సి ఉంటుందని రష్యాను యురోపియన్ యూనియన్ నాయకులుహెచ్చరించారు. అయినా వారి ఆంక్షల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మాత్రం తగ్గడం లేదు.

త‌న‌ను హెచ్చ‌రించిన దేశాల‌కు దీటుగా స‌మాధానమిచ్చారు. ప్రతీకార చర్యగా.. ర‌ష్యాపై ఆంక్షాలు విధించినా.. బ్రిటన్‌, జర్మనీ సహా 36 దేశాల విమాన సేవాల‌పై ర‌ష్యా నిషేధం విధించింది. రష్యా ఎయిర్‌పోర్టుల్లో కార్యకలాపాలు, గగనతలాన్ని ఆయా దేశాల విమానాలు వినియోగించుకోవడాన్ని నిషేధించింది. రష్యా ఏవియేష‌న్ అథారిటీ ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రష్యా విమానాలతోపాటు గగనతలం వినియోగంపై యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) దేశాలు నిషేధం విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రష్యా అధికారులు ఈ మేరకు వెల్లడించారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఐక్య రాజ్య స‌మితితో భేటీ కావ‌డానికి జెనీవాకు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. కానీ, చ‌ర్చ‌లు విఫ‌లం కావ‌డంతో ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. 

మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేయడంపై అంతర్జాతీయ ఫుట్ బాల్ సమాఖ్య (FIFA) స్పందించింది. రష్యా ఫుట్ బాల్ టీంను ప్రపంచ కప్ లో ఆడేందుకు అనుమతించేది లేదని ఫిఫా పేర్కొంది.