ఉక్రెయిన్ పై రష్యా మారణహోమం చేస్తోంది. ఉక్రెయిన్ రాజధాని అయిన కైవ్ లో రష్యా దాడి వల్ల ఇప్పటి వరకు 228 మంది చనిపోయారు. ఇందులో నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో 912 మందికి గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని కైవ్ నగరపాలక సంస్థ అధికారికంగా ప్రకటించింది.
ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russai) దాడి కొనసాగుతోంది. రష్యా సైనికులు దాడిని ఉక్రెయిన్ సేనలు ధీటుగా ఎదుర్కొంటున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య భీకరపోరు సాగుతోంది. ఈ యుద్ధం వల్ల రెండు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. రెండు వైపులా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం అధికంగానే జరుగుతోంది. యుద్దం ఆపాలని ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా విఫలం అయ్యాయి. ఉక్రెయిన్ కు, రష్యా కు మూడు సార్లు శాంతి చర్చలు జరిగినా అవి ఎలాంటి ఫలితాలనూ ఇవ్వలేదు.
ఉక్రెయిన్ రాజధాని కైవ్ (Kyiv). రష్యా సేనలు మొదటి నుంచీ ఈ కైవ్ ను స్వాధీనం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే దీనిని రష్యా వశం కానివ్వకుండా ఉక్రెయిన్ బలగాలు అడ్డుకుంటున్నాయి. యుద్దం మొదలైన మొదటి రోజుల్లోనే రష్యా కైవ్ పై దాడి చేయడం ప్రారంభించింది. దీంతో ఆ నగరంలో తీవ్రంగా ప్రాణనష్టం జరుగుతోంది. సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా మృతి చెందుతున్నారు. అయితే యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ ముఖ్యనగరం కైవ్ లో దాదాపు 228 మంది మరణించారు. ఈ విషయాన్ని ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. ‘‘ ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి రాజధానిలో నలుగురు పిల్లలతో పాటు మొత్తంగా 228 మంది సాధారణ పౌరులు మరణించారు. మరో 912 మంది గాయపడ్డారు ’’ అని కైవ్ నగర పాలక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
రష్యా దాడి వల్ల ఉక్రెయిన్ లోని పలు ప్రధాన నగరాలు ఇప్పటికే స్మశానదిబ్బలుగా మారాయి. తమ నగరాలను కాపాడుకోవడాని ఉక్రెయిన్ సైన్యం కూడా వీరోచితంగా పోరాటం సాగిస్తోంది. రష్యాన్ సేనలకు దీటుగా ప్రతి ఘటనను కనబరుస్తున్నాయి. కాగా రష్యా దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉక్రెయిన్ కు పరోక్షంగా సహకారం అందిస్తున్నాయి. జెలెన్ స్కీ సైన్యానికి మద్దతుగా నిలిచాయి. రష్యా దాడి వల్ల ఉక్రెయిన్ లోని కీవ్, మరియూపోల్,ఖర్కివ్, ఖేర్సన్, ఇర్ఫిన్ ను లోనిపలు భవనాలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు బాంబుల దాడులకు ధ్వంసం అయ్యాయి.
ఐక్యరాజ్యసమితి (UNO) నివేదికల ప్రకారం.. దాదాపు.. 30 లక్షల మంది వరకు ఉక్రెయిన్ ను విడిచి పొరుగు దేశాలకు వెళ్ళిపోయారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 6.5 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మన దేశ పౌరులు కూడా అక్కడ చిక్కుకుపోయారు. అయితే వారిని భారత్ ఆపరేషన్ గంగా అనే ప్రత్యేక మిషన్ చేపట్టి ఇండియాకు తీసుకొచ్చింది. దాదాపు 20 వేల మందిని సురక్షితంగా ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చామని ఇటీవల ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటించింది. అలాగే నేపాల్, పాకిస్తాన్ కు చెందిన పలువురు స్టూడెంట్లకు కూడా భారత్ సహాయం చేసింది. ఉక్రెయిన్ లో చదువుకుంటూ రష్యా దాడి వల్ల అక్కడి నగరాల్లో చిక్కుకుపోయిన పలువురు స్టూడెంట్లను భారత స్టూడెంట్లతో పాటుగా సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అక్కడి నుంచి వారి సొంత దేశాలకు వెళ్లే ఏర్పాట్లు చేసింది. దీంతో వారు భారత్ కు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు.
