రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇన్ఫోసిస్‌లో భారీగా షేర్లు ఉన్నాయి.
బ్రిటన్ నూతన ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టనున్నారు. రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెకు ఇన్ఫోసిస్‌లో భారీగా షేర్లు ఉన్నాయి. దీంతో 2022లో అక్షతా మూర్తి తన వాటాలపై డివిడెండ్ రూపంలో రూ.126.61కోట్ల ఆదాయం సొంతం చేసుకున్నారు. వివరాలు.. స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇన్ఫోసిన్ కంపెనీ దాఖలు చేసిన సమాచారం ప్రకారం అక్షతా మూర్తి కంపెనీలో 0.93 శాతం వాటా లేదా 3.89 కోట్ల షేర్లు కలిగి ఉన్నారు. బీఎస్‌ఈలో మంగళవారం ట్రేడింగ్ ధర రూ. 1,527.40 వద్ద ఆమె హోల్డింగ్ విలువ రూ. 5,956 కోట్లు (దాదాపు $721 మిలియన్లు)కు సమానం.
ఇన్ఫోసిస్ ఈ ఏడాది మే 31న 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ. 16 తుది డివిడెండ్ చెల్లించింది. ప్రస్తుత సంవత్సరానికి.. రూ. 16.5 మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించనున్నట్టుగా సంస్థ ఈ నెలలో ప్రకటించింది. ఈ రెండు డివిడెండ్‌లను కలుపుకుంటే.. ఒక్కో షేరుపై రూ.32.5 లభించాయి. ఈ లెక్కన డివిడెండ్‌ల రూపంలోనే అక్షతా మూర్తి రూ.126.61 కోట్లను సంపాదించారు.
భారతదేశంలో అత్యుత్తమ డివిడెండ్ చెల్లించే కంపెనీలలో ఇన్ఫోసిస్ ఒకటి. 2021లో ఇన్ఫోసిన్ ఒక్కో షేరుకు మొత్తం రూ. 30 డివిడెండ్‌ని చెల్లించింది. ఇది ఆ క్యాలెండర్ సంవత్సరంలో అక్షతా మూర్తికి మొత్తం రూ. 119.5 కోట్లను ఇచ్చింది.
ఇక, ఇన్ఫోసిస్ ఫైలింగ్స్ ప్రకారం.. కంపెనీలో ప్రమోటర్లు 13.11 శాతం వాటా కలిగి ఉన్నారు. ఇందులో మూర్తి కుటుంబానికి 3.6 శాతం వాటా ఉంది. అందులో నారాయణ మూర్తికి 0.40 శాతం, ఆయన భార్య సుధకు 0.82 శాతం, కుమారుడు రోహన్‌కు 1.45 శాతం, కుమార్తె అక్షతకు 0.93 శాతం వాటాలు ఉన్నాయి. ఇక, ఇతర ప్రమోటర్లలో సహ వ్యవస్థాపకుడు ఎస్ గోపాలకృష్ణన్, నందన్ ఎం నీలేకని, ఎస్‌డీ శిబులాల్, వారి కుటుంబాలు ఉన్నారు.
ఇదిలా ఉంటే.. భారత సంతతికి చెందిన రిషి సునక్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తొలి శ్వేతజాతీయేతర వ్యక్తిగా బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. పలు నాటకీయ పరిణామాల అనంతరం సోమవారం సాయంత్రం ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే మంగళవారం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ IIIని రిషి సునాక్ కలిశారు. ఈ సందర్భంగా ప్రధానిగా తనకు పూర్తి మద్ధతు ఉందని.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సమ్మతించిన కింగ్ చార్లెస్ III.. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా రిషి సునాక్‌ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ తదుపరి ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
