శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం దేశాధ్యక్షుడు గోటబయ రాజపక్స పారిపోయిన నేపథ్యంలో సింఘే కూడా పదవి నుంచి తప్పుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆందోళనకారులు దేశవ్యాప్తంగా నిరసనలు చేశారు. ఈ క్రమంలో ఏకంగా అధ్యక్షుడు గోటబయ రాజపక్షే ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఆయన దేశాన్ని విడిచి పారిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. ప్రస్తుతం ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే సైతం తన పదవికి రాజీనామా చేసినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే అధ్యక్షుడు రాజపక్షే సైతం రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం వుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. కొలంబోలోని ప్రధాని విక్రమ సింఘే ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అలాగే కొందరు ఎంపీలపైనా దాడులు జరుగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీలంకలో పూర్తిగా పరిస్ధితి అదుపుతప్పినట్లుగా కనిపిస్తోంది. 

ఇకపోతే.. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఆ దేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఇంతటి సంక్షోభాన్ని చూడలేదు. చమురు సహా ఇతర అత్యవసర సరుకులనూ దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం దగ్గర విదేశీ మారకం లేదు. దీంతో ప్రజలు దిన దిన గండంగా బతుకుతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం బంక్‌ల ముందు వాహనాల్లో కిలోమీటర్ల మేర క్యూలో ఉంటున్నారు. కొందరైతే.. ఈ క్యూలో నిలిపిన వాహనాల్లోనే మరణిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలు శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ఇది వరకే హింసాత్మక ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రధానిగా మహింద రాజపక్స రాజీనామా కూడా చేశారు. తాజాగా, మరోసారి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు రాజధాని నగరానికి పోటెత్తారు.

ALso Read:Sri Lanka Crisis: పారిపోయిన అధ్యక్షుడు.. నేవీ షిప్‌లో సూట్‌కేసుల లోడింగ్ (వీడియో)

వేలాది సంఖ్యలో ప్రజలు అధ్యక్షుడు అధికారిక నివాసం వైపుగా బయల్దేరారు. అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళనతో అధికారిక నివాసం చేరుకున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలోనే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసం నుంచి పారిపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడనేది ఇంకా తెలియదు. ఈ నేపథ్యంలోనే ఓ కీలక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పారిపోయిన నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన సూట్‌కేసులు నేవీ షిప్‌లో వేగంగా లోడ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఎస్ఎల్ఎన్ఎష్ గజబాహు నేవీ షిప్‌లో ముగ్గురు వ్యక్తులు పెద్ద పెద్ద సూట్‌కేసులను తీసుకెళ్లుతున్నట్టుగా ఆ వీడియో తెలుపుతున్నది. ఆ ముగ్గురు సూట్‌కేసులను వేగంగా ఆత్రంగా పట్టుకుని లాగుతూ పరుగెడుతున్నారు. ఈ సూట్‌కేసులు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేవేనని స్థానిక మీడియా పేర్కొంది.