పీకల్లోతు ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతోన్న శ్రీలంకలో పరిస్ధితులు ఏ మాత్రం మారలేదు. ఆ దేశాధ్యక్షుడు గోటబయ రాజపక్షే ఇంట్లోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. ఈ ఘటనలో నిరసనకారులను అదుపు చేసేందుకు సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది.
ఆర్ధిక సంక్షోభంతో (srilanka crisis) అల్లాడుతోన్న శ్రీలంక మరోసారి రణరంగంగా మారింది. ఆ దేశ అధ్యక్షుడు రాజపక్షే (gotabaya rajapaksa) ఇంట్లోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. దీంతో ఆందోళనకారులపై శ్రీలంక సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీఛార్జీకి దిగింది సైన్యం. ఈ ఘటనలో 26 మందికి తీవ్ర గాయాలు అయినట్లుగా కథనాలు వస్తున్నాయి. అలాగే నలుగురు జవాన్లకు కూడా గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.
కాగా.. శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా కోలుకోవడం లేదు. విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో ఆ దేశ అవసరాలకు సరిపడే ఇంధనాన్ని కూడా అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొన్ని రంగాలకు అస్సలు ఇంధనాన్ని కేటాయించడం లేదు. ఈ ఇంధన సంక్షభ ప్రభావం ముఖ్యంగా విద్యా వ్యవస్థపై పడింది. జూలై 4వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.
ఈ సెలవులు వారం పాటు కొనసాగుతాయని శ్రీలంక విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఈ వారం రోజుల్లో పిల్లలు కోల్పోయిన సిలబస్ వచ్చే వారం క్లాసుల్లో కవర్ అవుతాయని పేర్కొన్నారు. కాగా అంతకు ముందు కూడా జూన్ 18వ తేదీన శ్రీలంక ప్రభుత్వం వారం రోజుల పాటు అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సెలువులు ముగిసిపోయి ఇటీవలే పాఠశాలను తెరిచారు. తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి నిర్ణయమే తీసుకోవాల్సి వచ్చింది.
Also Read:పాపం శ్రీలంక... ఇంధన కొరత వల్ల దేశ వ్యాప్తంగా పాఠశాలలను మూసివేసిన ప్రభుత్వం
ఇకపోతే... శ్రీలంకకు 1948లో స్వతంత్రం వచ్చింది. అప్పటి నుంచి ఉన్నత-మధ్య-ఆదాయ దేశంగా ఉన్న ఈ ద్వీప దేశం ఈ ఏడాది మార్చి నుంచి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది. దీంతో ఆ దేశంలో ప్రజలు తీవ్ర నిరసనలు తెలియజేశారు. రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ తీవ్రమైన నిరసనలు రాజకీయ అశాంతికి దారితీశాయి, దీంతో అధ్యక్షుడు గోటబయ రాజపక్స సోదరుడు మహీందా రాజపక్స ప్రధానమంత్రి తన పదవికి మే నెలలో రాజీనామా చేశారు. కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే నియమితమయ్యారు.
మే నెలలో ఆహార ద్రవ్యోల్బణం 57.4 శాతంగా ఉంది. ముఖ్యమైన ఆహార పదార్థాల కొరత, అలాగే వంట, రవాణా, పరిశ్రమలకు ఇంధనం కొరత విస్తృతంగా ఉంది, రోజువారీ విద్యుత్ అంతరాయాలు కొనసాగుతున్నాయి. ఉత్పత్తి కోసం ప్రాథమిక ఇన్ పుట్ ల లభ్యత లేకపోవడం, అలాగే విదేశీ నిల్వలు కొరత, ఈ ఏడాది మార్చి నుంచి కరెన్సీ 80 శాతం తరుగుదల, అంతర్జాతీయ రుణ బాధ్యతలను తీర్చడంలో విఫలం కావడం వంటి కారణాల వల్ల ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక సంక్షోభం ముఖ్యంగా ఆహార భద్రత, వ్యవసాయం, జీవనోపాధి, ఆరోగ్య సేవలను పొందడంపై తీవ్ర ప్రభావం చూపింది. గత పంట కోతల సీజన్ లో ఆహార ఉత్పత్తి గత సంవత్సరం కంటే 40 - 50 శాతం తగ్గింది. విత్తనాలు, ఎరువులు, ఇంధనం, రుణ కొరతతో ప్రస్తుత వ్యవసాయ సీజన్ కూడా ప్రమాదంలో ఉంది.
