ర‌ష్యా-ఉక్రెయిన్ య‌ద్ధం మ‌ధ్య మ‌రో క‌ల‌క‌లం మొద‌లైంది. ర‌ష్యాలో తిరుగుబాటు మొద‌లైంది. అక్క‌డి ప్ర‌యివేటు సెక్యూరిటీ స‌ర్వీస్ వాగ్న‌ర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ ఈ సైనిక తిరుగుబాటును ప్ర‌క‌టించారు.

ర‌ష్యా-ఉక్రెయిన్ య‌ద్ధం మ‌ధ్య మ‌రో క‌ల‌క‌లం మొద‌లైంది. ర‌ష్యాలో తిరుగుబాటు మొద‌లైంది. అక్క‌డి ప్ర‌యివేటు సెక్యూరిటీ స‌ర్వీస్ వాగ్న‌ర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ ఈ సైనిక తిరుగుబాటును ప్ర‌క‌టించారు. అధ్యక్షుడు పుతిన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వాగ్నర్ కిరాయి సైన్యం హెచ్చరించింది. ఈ పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తొలిసారి స్పందించారు. టెలివిజన్ ప్రసంగంలో వ్లాదిమిర్ పుతిన్ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. వాగ్నర్ గ్రూప్ డాన్‌బాస్‌ను విముక్తి చేసిన హీరోలని పేర్కొన్నారు. తమకు అన్ని బలగాల ఐక్యత అవసరం అని చెప్పారు. తాము తమ ప్రజల జీవితం, భద్రత కోసం పోరాడుతున్నామని అన్నారు. 

తాము దేశద్రోహాన్ని ఎదుర్కొంటున్నామని.. వాగ్నర్ గ్రూప్ చేసిన సాయుధ తిరుగుబాటును ఉద్దేశించి అన్నారు. వాగ్నర్ కిరాయి సైన్యం చీఫ్ సాయుధ తిరుగుబాటును ‘‘ద్రోహం’’, ‘‘వెన్నుపోటు’’ అని పుతిన్ అభివర్ణించారు. రష్యాను కాపాడుతామని హామీ ఇచ్చారు. తిరుగుబాటును నిర్వహించే ద్రోహులపై నిర్ణయాత్మక చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. తిరుగుబాటులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ శిక్షించబడతారని హెచ్చరించారు. పరిస్థితిని పరిష్కరించడానికి రష్యా సాయుధ దళాలకు అవసరమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. 

ఇక, వాగ్నర్ గ్రూప్ అనేది ఉక్రెయిన్ లో సాధారణ రష్యన్ సైన్యంతో కలిసి పోరాడుతున్న కిరాయి సైనికుల ప్ర‌యివేటు సైన్యం. ఒకప్పుడు పుతిన్‌కు ప్రిగోజిన్ మిత్రుడు. అయితే ఇటీవలి కాలంలో పుతిన్‌తో తీవ్ర వైరం పెంచుకున్నారు. సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చిననీ ప్రిగోజిన్.. త‌న వాగ్న‌ర్ బ‌ల‌గాల‌తో ముందుకు సాగుతున్నారు. రోస్టోవ్ లోని సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ భవనాన్ని వాగ్నర్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో మాస్కో అంతటా భద్రతను కట్టుదిట్టం చేశామని ప్రభుత్వ మీడియా తెలిపింది. 

‘‘మాస్కోలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. మాస్కోలోని ప్రభుత్వ భవనాలు, రవాణా సౌకర్యాలు, ఇతర కీలక ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేశాం’’ అని సంబంధిత ర‌ష్యన్ అధికారులు తెలిపారు. తమ బలగాలు దక్షిణ సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించాయని వాగ్నర్ గ్రూప్ చీఫ్ చెప్పడంతో రోస్టోవ్ లోని రష్యా అధికారులు నివాసితులను ఇళ్లలోనే ఉండాలని కోరారు.