రష్యా వెంటనే యుద్ధోన్మాదాన్ని ఆపాలని.. రక్తపుటేరులు పారకుండా నిరోధించాలని.. చర్చల ద్వారా శాంతి నెలకొల్సాలని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. ఇది యుద్ధం కాదు మిలటరీ ఆపరేషన్ అన్న పుతిన్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.
న్యూఢిల్లీ : Ukraineపై కొనసాగుతున్న దాడికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ "స్పెషల్ మిలిటరీ ఆపరేషన్" అనే పదాన్ని ఉపయోగించడాన్ని Pope Francis ఆదివారం (మార్చి 6, 2022) అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు యుద్ధాన్ని వెంటనే ఆపాలని కోరారు. అది ఉన్మాదం అని చెప్పుకొచ్చారు.
Vatican Cityలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో గుమిగూడిన జనసమూహాన్ని ఉద్దేశించి తన వీక్లీ ప్రసంగంలో పోప్ మాట్లాడుతూ, ఇది కేవలం సైనిక చర్య కాదని, "మరణం, విధ్వంసం.. దుఃఖాలను నాటే యుద్ధం" అని అన్నారు. ఉక్రెయిన్‌లో రక్తపుటేరులు, కన్నీటి నదులు ప్రవహిస్తున్నాయి. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, మృత్యువు, విధ్వంసం.. దుఃఖానికి బీజం వేసే యుద్ధం’ అని ఆయన అన్నారు.
"ఆ అమరవీరుల దేశంలో మానవతా సహాయం అవసరం గంట గంటకు పెరుగుతోంది" అని పోప్ అన్నారు. "యుద్ధం అంటే పిచ్చి! దయచేసి ఆపండి! ఆ క్రూరత్వాన్ని మానేయండి" అన్నారాయన.
"Holy See శాంతిని పునరుద్ధరించడంలో ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది’ అని పోప్ అన్నారు. సహాయార్థుల కోసం ఇద్దరు రోమన్ కాథలిక్ కార్డినల్స్ ఉక్రెయిన్‌కు వెళ్లారని చెప్పారు. ప్రమాదం.. ప్రాణాలకు అపాయం అని తెలిసీ.. ప్రాణాలకు తెగించి యుద్ధాన్ని కవర్ చేస్తున్న విలేకరులకు, అక్కడి ప్రజల మీద జరుగుతున్న కృరత్వం, హింసలను వెలుగులోకి తెస్తున్న వారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు.
"సమాచారాన్ని అందించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన జర్నలిస్టులకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. సోదర సోదరీమణులారా, ఆ ప్రజల విషాదాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి సహాయపడుతున్న మీ సేవలకు ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చారు.
పోప్ ఇప్పటివరకు హింస గురించి చేసిన వ్యాఖ్యల్లో.. ఇవి అత్యంత బలమైనవి. అయినప్పటికీ, ఎక్కడా రష్యా పేరు ఉటంకించలేదు. దీనికి బదులు శాంతి, మానవతా కారిడార్ల ఏర్పాటు, తిరిగి చర్చలు జరపాలనే విజ్ఞప్తులనే పునరావృతం చేశారు.
రష్యా సైనిక చర్య భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి కాదని, ఉక్రెయిన్ సైనిక సామర్థ్యాలను ధ్వంసం చేయడానికి, దాని ప్రమాదకరమైన జాతీయవాద పాలకులుగా భావించే వాటిని స్వాధీనం చేసుకోవడానికి రూపొందించబడినదని పుతిన్ చెప్పడం గమనార్హం.
ఈ పోరాటం సోమవారం 12వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు 360 మంది పౌరులు మరణించారు. యుద్ధ నేపథ్యంలో దేశం నుండి పారిపోయిన శరణార్థుల సంఖ్య కూడా 1 మిలియన్ మార్క్‌ను దాటింది.
