అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌లో పోలీసులకు ఓ దొంగ పట్టపగలే చుక్కలు చూపించాడు. ఏకంగా డల్లాస్‌ అగ్నిమాపక విభాగానికి చెందిన అంబులెన్స్ ను ఎత్తుకెళ్లాడు. అదికూడా అగ్నిమాపక కేంద్రం నుంచే వాహనాన్ని దొంగిలించడం గమనార్హం.

అయితే, అది చూసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు గంటసేపు ఛేజ్ చేయాల్సి వచ్చింది.  దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతుంది. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
 
అగ్నిమాపక కేంద్రం నుంచి అంబులెన్స్ ను చోరీ చేసిన దొంగ కొలిస్​ కౌంటీ రహదారులపై వాహనాన్ని ఇష్టానుసారంగా నడపడం వీడియో లో ఉంది. దాంతో డల్లాస్ పోలీసులు సుమారు గంట పాటు అంబులెన్స్​ను వెంబడించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఇదే వాహనం ఇంతకుముందు కూడా ఒకసారి చోరీ కావడం, లూసియానాలో దొరకడం జరిగింది. దాంతో ఇంతకుముందు కూడా ఈ వ్యక్తే వాహనాన్ని దొంగలించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.