సులభంగా డబ్బు సంపాదించాలనో లేదంటే ఏ చీకూ చింతా లేకుండా గడిపేయాలనో చాలామంది బిక్షాటన చేస్తుంటారు. కాళ్లు, చేతులూ బాగానే వున్నా బాలేదని చెబుతూ కొందరు జనాన్ని మోసం చేస్తున్నారు.

మనదేశంలో ఇది సర్వసాధారణ విషయం. కానీ విదేశాల్లో దీనిని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. తాజాగా ఈజిప్టులో భిక్షాటన చేస్తోన్న ఓ మహిళను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు.

కాళ్లు బాగానే ఉన్నా.. దివ్యాంగురాలిగా నటిస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఆమెపై వచ్చిన ఆరోపణ. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. అందరూ ఆరోపిస్తున్నట్లుగా ఆమె దివ్యాంగురాలు మాత్రమే కాదు.. కోటీశ్వరురాలు కూడా.

వివరాల్లోకి వెళితే.. నఫీసా అనే మహిళ ఈజిప్టులోని పలు ప్రావిన్స్‌లో గత కొన్నాళ్లుగా దివ్యాంగురాలిగా నటిస్తూ వీల్‌ఛైర్‌లో కూర్చొని భిక్షాటన చేస్తోంది. పగటి పూట వీధుల వెంబడి తిరిగే ఆమె సాయంత్రం కాగానే వీల్‌ఛైర్‌ పక్కన పెట్టేసి, చక్కగా నడుచుకుంటూ వెళ్లిపోయేది.

చాలా మంది ఈ విషయాన్ని గమనించారు కూడా. అయితే విషయం పోలీసుల వరకు వెళ్లడంతో వారు నఫీసాను అరెస్టు చేశారు. పక్షవాతం వల్ల ఒక కాలు కోల్పోయినట్లు ఆమె చెప్పినా.. తర్వాత అది అవాస్తవమని తేలింది.

విచారణలో ఈ యాచకురాలికి గర్బియా, ఖలిబుయా గవర్నరేట్స్‌లో ఐదు నివాస భవనాలు ఉన్న విషయం బయటపడింది. అంతేకాదు, ఆమెకు చెందిన రెండు బ్యాంక్‌ ఖాతాల్లో 3 మిలియన్‌ ఈజిప్షియన్‌ పౌండ్స్‌(దాదాపు రూ.1.42కోట్లు) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నఫీసా కేసులో మరింత లోతైన దర్యాప్తు జరిపి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు.