పాకిస్తాన్ నూతన ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. ఈ రోజు ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో ప్రధాని కోసం ఎన్నిక జరిగింది. ఇమ్రాన్ ఖాన్‌ రాజీనామా ప్రకటించిన తర్వాత ఓటింగ్ జరిగింది. ఇందులో ప్రతిపక్ష నేతలు.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్‌ను పీఎంగా ఎన్నుకున్నారు. 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఆదివారం రాత్రి చర్చలు కీలక మలుపు తిరిగాయి. సుమారు 12 గంటలపాటు చర్చలు జరిగాయి. చివరకు ఇమ్రాన్ ఖాన్ సోమవారం తన రాజీనామా ప్రకటించారు. దేశాన్ని దోచుకున్న దొంగలతో కలిసి తాను నేషనల్ అసెంబ్లీలో కూర్చోనని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత ప్రతిపక్షాల్లో జోష్ కనిపించింది. ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి అసెంబ్లీకి వచ్చాయి. పాకిస్తాన్ ప్రధానిగా మూడు సార్లు బాధ్యతలు నిర్వర్తించిన నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్‌ను పాకిస్తాన్ నూతన ప్రధానిగా ఎన్నుకున్నారు. ఈ రోజు రాత్రే పీఎంఎల్ఎన్ పార్టీ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణం తీసుకోబోతున్నట్టు తెలిసింది.

నూతన పీఎంగా ఎన్నిక జరగనున్న ఈ రోజు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలోకి పీఎంఎల్ఎన్ నేతలు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చిత్రాలను తెచ్చారు. పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్.. ప్రధాన మంత్రిగా తన రాజీనామా ప్రకటించగానే ఆయన క్యాబినెట్‌లోని ఇతర మంత్రులు అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు ప్రకటించారు. కొందరు తమ రాజీనామా ప్రకటిస్తూ.. ఇమ్రాన్ ఖాన్ సమర్థమైన ప్రధాని అని పొగిడారు. ఆయన మళ్లీ ప్రధానమంత్రిగా ఎన్నిక కావాలని ఆశిస్తున్నట్టు పేర్కొంటూ రాజీనామాలు ప్రకటించారు.

పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రి కోసం ప్రతిపక్షాల ఓటింగ్ సమయంలో తాము నేషనల్ అసెంబ్లీలో కూర్చునేది లేదని పీటీఐ అధినేత, మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ ఈ ఓటింగ్‌కు ముందే స్పష్టం చేశారు. కొత్త ప్రధాని ఎన్నికను తాము బహిష్కరిస్తున్నామని తెలిపారు. అందుకే తాము అందరం పార్లమెంటు నుంచి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ దొంగలతో తాను నేషనల్ అసెంబ్లీలో కూర్చోబోనని అన్నారు. అనంతరం, పాకిస్తాన్ నూతన ప్రధాని కోసం ఎన్నిక జరిగింది. అందులో పీఎంఎల్ఎన్ చీఫ్ షాబాజ్ షరీఫ్‌ నూతన ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో షాబాజ్ షరీఫ్ 174 ఓట్లు గెలుచుకున్నారు. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ మొత్తం బలం 342. దీంతో ఆయన మెజార్టీ ఓట్లు పొందారు. ఆయన పాకిస్తాన్ 23వ ప్రధానిగా ఎన్నికయ్యారు.

ఇదిలా ఉండగా, నేషనల్ అసెంబ్లీ నుంచి పీటీఐ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు ప్రకటించగా.. దాని మిత్రపక్షం అయిన గ్రాండ్ డెమోక్రటిక్ అలయెన్స్ మాత్రం పార్లమెంటు నుంచి తాము రాజీనామా చేయబోమని స్పష్టం చేసింది. నూతన ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ఎన్నికైన తర్వాత ఆ పార్టీ చీఫ్ సైరా బానో ఈ ప్రకటన చేశారు.