భార్యతో ఉన్న మనస్పర్థాల కారణంగా తన సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని ఓ వ్యక్తి ఏకంగా విమానాన్ని హైజాక్ చేయబోయాడు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ వింత సంఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే...148 మంది ప్రయాణికులతో ఆదివారం ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్తున్నబంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరింది.

అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రయాణికుల్లో ఓ వ్యక్తి తన వద్ద పిస్తోలు, పేలుడు పదార్థాలు ఉన్నాయని బెదిరిస్తూ కాక్‌పిట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు.

తన భార్యతో గొడవలున్నాయని, ఈ విషయంపై ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడాలని పదే పదే డిమాండ్ చేసినట్లు పైలట్లు వెల్లడించారు. నిందితుడు ఆవేశాన్ని చూసిన పైలట్లు వెంటనే విమానాన్ని ఢాకాలో అత్యవసరంగా దించేశారు.

అక్కడ హైజాకర్‌తో ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ప్రయాణికులను విమానం నుంచి దించేయాలని అడగ్గా  అందుకు అంగీకరించాడు. దీంతో  వారిని ఎమర్జెన్స్ ఎగ్జిట్ గుండా బయటకు తీసుకొచ్చారు..

ఈ లోపు కమాండోలు అతనిని చుట్టుముట్టారు. లొంగిపోవాలని హెచ్చరించగా... అతడు అందుకు నిరాకరించడంతో కాల్పులు జరిపాడు.. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హైజాకర్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ వ్యక్తిని బంగ్లాదేశ్‌కు చెందిన మహదిగా గుర్తించారు.

అయితే అతడి వద్దకు పిస్తోలు, పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి... వాటిని విమానంలోకి ఎలా తీసుకురాగలిగడన్న దానిపై భద్రతా దళాలు దర్యాప్తు చేస్తున్నాయి.

విమానాన్ని హైజాక్ చేసేందుకు అతనికి ఎలాంటి ఉద్దేశం లేదని, కేవలం భార్యతో మనస్పర్థల కారణంగానే సదరు వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.