Asianet News TeluguAsianet News Telugu

ఐదేళ్ల పిల్లలకు అక్టోబర్‌లో ఫైజర్ టీకా?.. రెండేళ్ల పిల్లలపైనా ప్రయోగాలు

కరోనా టీకా పంపిణీలో అమెరికా ప్రపంచంలోనే ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. వయోవృద్ధులు, వయోజనులకే కాదు, పిల్లలకూ టీకా పంపిణీలోనూ ముందున్నది. ఇప్పటికే 12ఏళ్లు పైబడిన టీనేజర్లకు టీకా వేస్తున్నారు. కాగా, ఐదేళ్ల నుంచి 12 ఏళ్ల పిల్లలకూ ఫైజర్ టీకా అక్టోబర్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఫైజర్ టీకా ఇప్పటికే రెండేళ్లపైబడిన పిల్లలపైనా ప్రయోగాలు చేస్తున్నది. 

pfizer may get FDA nod to emergency use authorisation for five years to 12 years old childrens in america
Author
Washington D.C., First Published Aug 30, 2021, 4:20 PM IST

వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఫైజర్ టీకా చిన్నపిల్లలపై ప్రయోగాలను వేగంగా నిర్వహిస్తున్నది. డెల్టా వేరియంట్ కారణంగా పిల్లల్లోనూ కరోనా కేసులు పెరుగుతుండటంతో వారికి టీకా వేయడం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత అంశంగా మారింది. అమెరికా ఇప్పటికే 12ఏళ్లు పైబడిన టీనేజర్లకు టీకా వేస్తున్నది. అయితే, ఐదేళ్ల నుంచి 12ఏళ్ల వయసు పిల్లలకు టీకా అక్టోబర్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశమున్నట్టు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎప్‌డీఏ) వర్గాలు చెబుతున్నాయి.

అమెరికాలో ప్రస్తుతం మూడు టీకాలకు అనుమతి ఉన్నది. వీటిని పంపిణీ చేస్తున్నారు. ఇందులో ఫైజర్ టీకాకు 12ఏళ్లు పైబడినవారికీ వేయడానికి అత్యవసర వినియోగ అనుమతులు ఉన్నాయి. దీంతో 12ఏళ్లకు చిన్నపిల్లలకూ టీకా అందుబాటులోకి తేవాలని ఫార్మా సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఫైజర్‌తోపాటు మొడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలూ 12ఏళ్లలోపు పిల్లలపై టీకా ట్రయల్స్ ప్రారంభించాయి. అయితే, ఫైజర్ ముందంజలో ఉన్నది.

వచ్చే నెలలో 5ఏళ్ల నుంచి 12ఏళ్లలోపు పిల్లలపై ఫైజర్ టీకా సేఫ్టీ, ఎఫికసీ వివరాలను ఎఫ్‌డీఏకు సమర్పించే అవకాశముందని తెలిసింది. ఫైజర్ టీకా అనుమతులనూ ఐదేళ్లపిల్లలకూ వర్తింపజేయాలని దరఖాస్తు చేసుకునే అవకాశమూ అక్టోబర్‌లోనే ఉన్నదని ఎఫ్‌డీఏ మాజీ చీఫ్ స్కాట్ గాట్లీబ్ వివరించారు. అలాగైతే, అక్టోబర్‌లోనే ఆ టీకాకు సంబంధిత అనుమతులు లభించవచ్చునని తెలిపారు.

ఐదేళ్ల పిల్లలపైనే కాదు, రెండేళ్లుపైబడిన పిల్లలపైనా ఫైజర్ టీకా ప్రయోగాలు చేస్తున్నది. నవంబర్‌లో ఈ ట్రయల్స్ ఫలితాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఐదేళ్ల నుంచి 12ఏళ్ల పిల్లలకు ఫైజర్ టీకాకు అత్యవసర అనుమతులు లభించిన తర్వాత ఈ ఏడాదిలోనే వారికి టీకా పంపిణీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయని నిపుణులు చెప్పారు. ఇంతలోనే రెండేళ్లపైబడిన పిల్లలకు టీకా అత్యవసర అనుమతుల కోసం ఫైజర్ మరోసారి దరఖాస్తు చేసుకునే వీలుందని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios