క్రిస్మస్ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి. క్రిస్మస్ అనగానే.. శాంతా క్లాజ్ వచ్చి అందరికీ బహుమతులు అందజేస్తారని పిల్లలు అందరూ సంబరపడతారు కూడా. కాగా.. ఓ శాంతా క్లాజ్ ఇదే విధంగా వెళ్లి ఓ డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. ఈ సంఘటన పెరూలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పెరూ రాజధాని లీమాలో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతను డ్రగ్స్ అమ్ముతున్నాడని పోలీసులకు ఉప్పందింది. దీంతో అతనిపై వాళ్లు నిఘా పెట్టారు. ఈ క్రమంలో తన ఇంటి ముందే ఇతరులకు మాదక ద్రవ్యాలు అమ్ముతూ అతను పోలీసుల కంటపడ్డాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ఓ పథకం వేశారు. ఇద్దరు ఆఫీసర్లు శాంతాక్లాజ్, అతని సహచరుడి వేషాలు వేసుకున్నారు. ఓ పెద్ద సుత్తి తీసుకొని నిందితుడి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లారు.. ఆ ఇంటిని చేరుకోగానే సుత్తితో తలుపులు బద్దలు కొట్టారు. ఈ చప్పుళ్లు విని ఆదరాబాదరాగా పరిగెత్తుకొచ్చిన నిందితుడిని బలవంతంగా అదుపులోకి తీసుకొని బేడీలు వేశారు. ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ‘‘మేం పోలీసులం. యాంటీ-డ్రగ్ ఆపరేషన్లు చేసే గ్రీన్ స్క్వాడ్ నుంచి వస్తున్నాం’’ అని శాంతాక్లాజ్ వేషంలో ఉన్న అధికారి కేకలు వేయడం పోలీసులు తీసిన వీడియోలో వినపడుతోంది.