నేపాల్‌లో కుప్పకూలిన విమానం.. ప్రమాద సమయంలో విమానంలో 72 మంది.. 16 మృతదేహాలు వెలికితీత..
నేపాల్‌లో ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పకూలింది. ఖాట్మండు నుంచి పోఖారాకు బయలుదేరిన Yeti Airlinesకు చెందిన 9ఎన్-ఏఎన్‌సీ ఏటీఆర్ 72 విమానం ఆదివారం ఉదయం పోఖారాలో కూలిపోయింది.

నేపాల్‌లో ప్రయాణికులతో వెళ్తున్న విమానం కుప్పకూలింది. ఖాట్మండు నుంచి పోఖారాకు బయలుదేరిన Yeti Airlinesకు చెందిన 9ఎన్-ఏఎన్‌సీ ఏటీఆర్ 72 విమానం ఆదివారం ఉదయం పోఖారాలో కూలిపోయింది. ల్యాండింగ్ సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటన స్థలం నుంచి 16 మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీసినట్టుగా నేపాల్ మీడియా పేర్కొంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, ప్రమాద సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం ప్రమాదానికి గురైన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో దట్టంగా పొగ అలుముకుంది.
సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్ ప్రకారం.. ఈ విమానం ఖాట్మండు నుంచి ఉదయం 10:33 గంటలకు బయలుదేరింది. పోఖారా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతండగా పాత విమానాశ్రయం, కొత్త విమానాశ్రయం మధ్య ఉన్న సేతీ నది ఒడ్డున విమానం కూలిపోయింది. ఇక, ఈ ఘటన అనంతరం పోఖారా విమానాశ్రయంను తాత్కాలికంగా మూసివేశారు.