Asianet News TeluguAsianet News Telugu

Taliban: కశ్మీర్ ఆక్రమణకు తాలిబాన్లు సహకరిస్తామన్నారు: పాక్ అధికారపార్టీ నేత వ్యాఖ్యలు.. యాంకర్‌కు షాక్

లైవ్ డిబేట్‌లో పాకిస్తాన్ అధికారిక పార్టీ పీటీఐ నేత నీలం ఇర్షద్ షేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ను ఆక్రమించుకోవడంలో పాకిస్తాన్‌కు సహాయం చేస్తామని తాలిబాన్లు చెప్పినట్టు వెల్లడించారు. షాక్‌కు గురైన యాంకర్ సదరు నేత మాట్లాడిన మటలను మరోసారి సరిచూసుకోవాలని సూచించగా ఆమె మరోసారి వాటిని సమర్థించుకున్నారు. ఈ షో భారత్ సహా ప్రపంచ దేశాల్లోనూ ప్రసారమవుతుందని యాంకర్ చెప్పడం గమనార్హం.

pakistan ruling party pti leader says taliban will help pak to capture kashmir in live debate triggers concerns
Author
Islamabad, First Published Aug 25, 2021, 1:41 PM IST

ఇస్లామాబాద్: ఆఫ్ఘనిస్తాన్‌లో 20ఏళ్లపాటు దాడులు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబాన్లకు పాకిస్తాన్ ఆర్మీకి దగ్గరి సంబంధాలున్నాయని మరోసారి రుజువైంది. గత ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వమూ తాలిబాన్లకు పాకిస్తాన్ సహకరిస్తుందని పలుసార్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా, పాకిస్తాన్ అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్(పీటీఐ) నేత ఈ ఆరోపణలను రూఢీ చేశారు. పాకిస్తాన్‌లో ఓ న్యూస్ చానెల్ లైవ్ డిబేట్‌లో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. కశ్మీర్‌ను ఆక్రమించుకోవడంలో తాలిబాన్లు తమకు సహకరిస్తారని ప్రకటించడం వారితో ప్రభుత్వానికి ఉన్న సాన్నిహిత్యాన్ని వెల్లడిస్తున్నాయి.

అధికార పార్టీ నేత నీలం ఇర్షద్ షేక్ బహిరంగంగా ఓ టీవీ న్యూస్ డిబేట్‌లో ఈ ప్రకటన చేశారు. కశ్మీర్ కోసం పాకిస్తాన్, తాలిబాన్లు కలిసి పనిచేయనున్నట్టు ఆమె తెలిపారు. తాలిబాన్లు తమకు అండగా ఉన్నట్టు ప్రకటించారన్నారు. కశ్మీర్‌లో వారు తము సహాయపడతామని చెప్పినట్టు వివరించారు. నీలం ఇర్షద్ షేక్ వ్యాఖ్యలతో డిబేట్ నిర్వహిస్తున్న యాంకర్ షాక్‌కు గురయ్యారు.

‘మేడం మీరు ఇప్పుడు ఏం అన్నారో మీకైనా అర్థమవుతుందా? మీరు అన్నదానిపై మీకు అసలు అవగాహనే లేదు. దేవుడా.. ఈ షో ప్రపంచమంతా ప్రసారమవుతుంది. ఇండియాలోనూ ఇది చూస్తారు’ అంటూ యాంకర్ అన్నారు. అయినప్పటికీ ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. అంతేకాదు, వాటిని సమర్థించుకుంటూ తాలిబాన్లతో తప్పుగా నడుచుకున్నారని, అందుకే వారు పాకిస్తాన్‌కు సహాయపడటానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొనడం వివాదాన్ని తారాస్థాయికి తీసుకెళ్లింది.

ఓ ప్రకటనలో తాలిబాన్లు కశ్మీర్ సమస్యలో కలుగజేసుకోబోమని చెప్పారు. కశ్మీర్ అనేది భారత అంతర్గత వ్యవహారమని, అది ద్వైపాక్షికమైన అంశమని పేర్కొన్నారు.

తాలిబాన్లతో పాకిస్తాన్‌ సంబంధాలను ప్రపంచ దేశాలన్ని తీక్షణంగా పరిశీలిస్తున్నాయి. తాలిబాన్లకు సానుకూల వ్యవహారంపై ఒకింత ఆగ్రహంతోనే ఉన్నాయి. గత ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వమూ తాలిబాన్లు బలోపేతం కావడానికి పాకిస్తాన్ ప్రధాన కారణమని ఎన్నోసార్లు పేర్కొంది. ఈ తరుణంలోనే అధికార పార్టీ పీటీఐ నేత పై వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios