ఒంట్లో బాలేదనో.... ఏదైనా పనిమీదనో సెలవు అడిగే వాళ్లను చూశాం.. అది కూడా ఏ రెండు రోజులో... మూడు రోజులో.. కానీ ఏకంగా 730 రోజులు సెలవులు కావాలని అడిగిన ఉద్యోగిని ఎక్కడైనా చూశారా.?

పాకిస్తాన్ రైల్వే శాఖకు చెందిన మహమ్మద్ హనీఫ్ గుల్ క్రమశిక్షణ గల ఉద్యోగి. ఆయనెప్పుడూ డ్యూటీ ఫస్ట్ మిగిలినవి నెక్ట్స్ అనే సూత్రాన్ని బాగా నమ్ముతారు. హనీఫ్‌ను కొందరు ఇష్టపడితే.. మరికొందరు ద్వేషిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి 730 రోజుల పాటు సెలవు కోరుతూ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.

రైల్వేశాఖకు నూతన మంత్రిగా షేక్ రషీద్ అహ్మద్ బాధ్యతలు చేపట్టారు... అయితే ఆయనకు రైల్వే మంత్రికి కావల్సిన నైపుణ్యాలు లేవు.. ఆయనతో కలిసి నేను పనిచేయలేను.. కాబట్టి నాకు 730 రోజులు సెలవు ఇప్పించాల్సిందిగా కోరుతున్నారు అంటూ హనీఫ్ రాసిన లేఖ మీడియాకి చిక్కింది. అంతే అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనిపై హనీఫ్‌ను ప్రశ్నించగా...రైల్వేమంత్రి రషీద్‌తో పనిచేయడం నాకు ఇష్టం లేదు.. అందుకే రెండు సంవత్సరాల పాటు సెలవులో ఉండాలనుకుంటున్నాను.. అప్పటికైనా ఆయన తీరులో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను అని తెలిపాడు. సెలవు కాలంలో ఫుల్ పేమెంట్ ఇవ్వాలని అభ్యర్థించడం విశేషం.