పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్‌ను అవమాన పరిచేలా వ్యవహరించారు. వివరాల్లోకి వెళితే... గత వారం సౌదీ ప్రభుత్వం మక్కా వేదికగా అరబ్ దేశాల కూటమి.. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్‌ సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సమావేశానికి హాజరైన సౌదీ రాజు వద్దకు ఇమ్రాన్ వెళ్లి కరచాలనం చేశారు. అనంతరం వీరిద్దరి మధ్య పలు అంశాలపై సంభాషణ జరిగింది. సౌదీ రాజుతో పక్కనే ట్రాన్స్‌లేటర్ ఇమ్రాన్ చెప్పే సందేశాన్ని ఆయనకు వివరిస్తున్నారు.

అయితే చివర్లో ఇమ్రాన్ చెప్పిన మాటలు ట్రాన్స్‌లేటర్ రాజుకు వివరించే లోపే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. సౌదీ రాజును అవమానపరచడంతో పాటు ప్రోటోకాల్‌ను కూడా ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సౌదీరాజుతో మాట్లాడేటప్పుడు ఇమ్రాన్ బాడీ లాంగ్వేజ్ సరిగా లేదని విమర్శిస్తున్నారు.

పాక్ ప్రధాని ప్రవర్తన కారణంగా.. సౌదీ, పాకిస్తాన్‌ల మధ్య తర్వాత జరగాల్సిన సమావేశం రద్దయిందని పలువురు పోస్ట్‌లు పెడుతున్నారు. మరి దీనిపై ఇమ్రాన్ ఖాన్ ఏ రకంగా స్పందిస్తారో  వేచి చూడాలి.