ఇండియా దాయాది దేశం పాకిస్థాన్ లో ఇవాళ 11వ జాతీయ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఓ ప్రభుత్వం తన పదవీకాలాన్ని ముగించి ఎన్నికలకు వెళ్లడం పాకిస్థాన్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇంతకుముందు ఏర్పడ్డ ప్రతి ప్రభుత్వం తన పదవీ కాలం ముగియకుండానే ఏదో ఒక కారణంతో అధికారాన్ని కోల్పోయేది.

ఇలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 272 జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్) స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం ఆరు గంటల నుండే పోలీంగ్ బూతుల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇంచుమించు 24 గంటల్లోపే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

జాతీయ అసెంబ్లీ స్థానాలతో పాటు పంజాబ్‌, సింధ్‌, బలూచీస్తాన్‌, ఖైబర్‌ ఫక్తున్‌క్వా రాష్ట్రాల్లోని  577 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.  ఇవాళ జరుగుతున్న మొత్తం ఎన్నికల్లో దాదాపు 30 పార్టీలకు చెందిన 12,570 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. దాదాపు పదికోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా సైన్యం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. మొత్తం 85 వేల పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ కొనసాగుతుండగా రక్షణ కోసం దాదాపు 8 లక్షల మంది పోలీసులు, మిలిటరీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 30 పార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రధాన పోటీ మాత్రం మూడు పార్టీల మద్యే నెలకొంది. మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వం వహిస్తున్న తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ), మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు చెందిన పాకిస్థాన్ ముస్లీం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్‌), బిలావల్ బుట్టో జర్దారి నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పిపిపి)ల మధ్య పోటీ కొనసాగుతుంది.