Asianet News TeluguAsianet News Telugu

పాకిస్తాన్ ప్రభుత్వానికి అవమానం.. ఇమ్రాన్ ఖాన్‌పై ఎంబసీ ట్రోలింగ్.. ‘మీరు చెప్పే నూతన పాకిస్తాన్ ఇదేనా?’

పాకిస్తాన్ ప్రభుత్వానికి తీవ్ర అవమానం ఎదురైంది. విదేశంలోని ఓ పాకిస్తాన్ ఎంబసీ కార్యాలయం అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. మూడేళ్లుగా జీతాలు ఇవ్వలేదని, తమ పిల్లలకు ఫీజులు కూడా కట్టలేని దయనీయ స్థితికి తమను నెట్టేసిందని సెర్బియాలోని పాకిస్తాన్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఇంకా ఎన్నాళ్లు తమను ఇలాగే మౌనంగా పని చేసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ ఆశిస్తున్నాడని విరుచుకుపడింది. అంతేకాదు, ఇదేనా నూతన పాకిస్తాన్(నయా పాకిస్తాన్) అంటే అంటూ నిలదీసింది.
 

Pakistan Embassy trolls PM Imran Khan over salaries in twitter
Author
New Delhi, First Published Dec 3, 2021, 12:52 PM IST

న్యూఢిల్లీ: Pakistan ప్రభుత్వానికి తీవ్ర భంగపాటు ఎదురైంది. ఆ దేశ దౌత్య కార్యాలయమే పాకిస్తాన్ ప్రభుత్వంపై ట్రోలింగ్ చేసింది. ‘మీరు చెప్పే నూతన పాకిస్తాన్ అంటే ఇదేనా?’ అంటూ సెర్బియా దేశంలోని పాకిస్తాన్ ఎంబసీ(Pakistan Embassy) అధికారిక ట్విట్టర్(Twitter) హ్యాండిల్ నుంచి ఇమ్రాన్ ఖాన్‌పై విమర్శలు కురిశాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశ దౌత్య అధికారులకు కొన్ని నెలలుగా వేతనాలు ఇవ్వలేదనే విషయాన్ని ఈ ట్వీట్‌తో ప్రపంచానికి తెలిసింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ఉన్నత అధికారుల్లో ఉన్న అసంతృప్తిని బహిరంగ పరిచింది. ఈ రోజు ఉదయం 11:26 గంటలకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై విమర్శలు చేస్తూ ట్విట్టర్‌లో ఈ విషయం పోస్టు అయింది.

దేశంలో ద్రవ్యోల్బణం గత రికార్డులన్నింటినీ చెరిపేస్తున్నదని సెర్బియాలోని పాకిస్తాన్ ఎంబసీ కార్యాలయం మండిపడింది. ‘మమ్మల్ని ఇంకా ఎంత కాలం మౌనంగా పని చేసుకోవాలని మీరు కోరుకుంటున్నారు. మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. ఫీజులు కట్టలేదని మా పిల్లలను స్కూల్ నుంచి బయటకు గెంటేస్తున్నారు. అయినా ఇంకా ఎంత కాలం నోరుకు తాళం వేసుకోవాలని అనుకుంటున్నారు. ఇదేనా నూతన పాకిస్తాన్ అంటే?’ అంటూ ట్వీట్ చేసింది.

Also Read: 26/11 Mumbai Attacks: ఆర్ఎస్ఎస్ ప్లాన్ అని నిందలు వేసిన కాంగీలను మరువొద్దు: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

‘మీరు ఆందోళన  చెందవద్దు’ అనే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను వ్యంగ్యం చేస్తూ విమర్శలు కురిపించిన ఓ వీడియోనూ ఆ ట్వీట్‌తో జత చేశారు. సయీద్ అలేవీ అఫీషియల్ పేరు ఆ వీడియోల వాటర్ మార్క్ చేయబడి ఉన్నది. నిత్యావసర సరుకులు, ఔషదాల ధరలూ భారీగా పెరిగిన వైనాన్ని ప్రస్తావిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వంపై ఆ వీడియోలో విమర్శలు ఉన్నాయి. అంతేకాదు, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దేశాన్ని అధోపాతాళానికి తీసుకెళ్తున్నదని ఆ వీడియో పేర్కొంది.

అదే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వెంటనే మరో ట్వీట్ కూడా వచ్చింది. సారీ ఇమ్రాన్ ఖాన్.. నాకు మరో అవకాశం లేకపోయింది అనే అర్థంతో ఆ ట్వీట్ ఉన్నది. సెర్బియా దేశంలోని పాకిస్తాన్ ఎంబసీ చేసిన ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై సొంత అధికారులే తిరుగుబాటు చేయడంపై కలవరం రేగింది. దీంతో వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు సర్దుబాటు పనిలో పడ్డారు. నష్ట నివారణ ప్రయత్నానికి పూనుకున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై డిజిటల్ మీడియాలో కీలకంగా వ్యవహరించే అధికారి డాక్టర్ అర్స్‌లాన్ ఖాలిద్ స్పందించారు. ఆ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని, దానిపై దర్యాప్తు ప్రారంభించినట్టు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios