Asianet News TeluguAsianet News Telugu

ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్న ఇమ్రాన్.. షాకిచ్చిన ఎన్నికల సంఘం

మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇక లాంఛనమే. ఈ పరిస్థితుల్లో ఎంతో ఆనందంగా ఉన్న మాజీ కెప్టెన్‌కి పాక్ ఎన్నికల సంఘం షాకిచ్చింది. పోలింగ్ సందర్భంగా అందరికీ కనిపించేలా బహిరంగంగా ఓటు వేసినట్లు వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ఇమ్రాన్‌ఖాన్‌కు నోటీసులు జారీ చేసింది.

Pakistan Election Commission send notice to Imran Khan

పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్. మేజిక్ ఫిగర్‌కు కొద్ది అడుగుల దూరంలో నిలిచిపోవడంతో చిన్నాచితకా పార్టీల మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఆ పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇక లాంఛనమే. ఈ పరిస్థితుల్లో ఎంతో ఆనందంగా ఉన్న మాజీ కెప్టెన్‌కి పాక్ ఎన్నికల సంఘం షాకిచ్చింది.

పోలింగ్ సందర్భంగా అందరికీ కనిపించేలా బహిరంగంగా ఓటు వేసినట్లు వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలంటూ ఇమ్రాన్‌ఖాన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 25న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన బంధుమిత్రులు, కార్యకర్తలు, మీడియా కెమెరాల సమక్షంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రహస్య బ్యాలెట్ విధానం అమల్లో ఉన్నప్పటికీ ఆయన ఇలా చేయడంపై ప్రిసైడింగ్ అధికారిగానీ.. పోలింగ్ సిబ్బందిగానీ అభ్యంతరం తెలపలేదు..

అయితే దీనిపై కొందరు ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఇమ్రాన్  ఖాన్‌కి సమన్లు జారీ అయ్యాయి. దీనిపై ఆయన తరపున న్యాయవాది ఎలక్షన్ కమిషన్ ముందు హాజరయ్యారు.. అయితే దీనిపై సంతృప్తి చెందని ఈసీ రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని.. విచారణను వచ్చే నెల 16కు వాయిదా వేసింది. ఒకవేళ నేరం రుజువైతే ఇమ్రాన్‌పై ఎన్నికల చట్టంలోని 185 సెక్షన్ ప్రకారం.. ఆరు నెలల జైలు శిక్షతో పాటు.. రూ..1000 జరిమానా విధించే అవకాశం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios