వాషింగ్టన్: కనకదుర్గ అమ్మవారితో డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి నామినేట్ అయిన కమలా హారిస్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై అమెరికాలోని హిందూసంఘాలు కమలా హరిస్ మేనకోడలును క్షమాపణ చెప్పాలని కోరుతున్నాయి. 

ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్టును కమలా హరీస్ మేనకోడలు మీనా హరీస్ పోస్టు చేసింది. అయితే ఆ తర్వాత ఆమె ఈ పోస్టును తొలగించింది.పిల్లల పుస్తకాల రచయితగా మీనా హరీష్ కు పేరుంది. అంతేకాదు ఫెనోమెనల్ ఉమెన్ యాక్షన్ క్యాంపెయిన్ వ్యవస్థాపకురాలు ఆమె.

దుర్గాదేవికి ముఖానికి  కమలా హరీష్ ఫోటోతో సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పోస్టు ప్రపంచంలోని హిందువులను తీవ్రంగా బాధించిందని హిందూ అమెరికన్ పౌండేషన్ ఆరోపించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

హిందూ అమెరికన్ సమాజానికి ప్రాతినిథ్యం వహిస్తోంది హెచ్ఏఎఫ్. మతానికి సంబంధించిన చిత్రాలను వాణిజ్యపరంగా ఉపయోగించడానికి మార్గదర్శకాన్ని విడుదల చేసింది.

హిందూ అమెరికన్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి చెందిన రిషి భూటాడా మాట్లాడుతూ అప్రియమైన చిత్రాన్ని మీనా హారిస్ స్వయంగా సృష్టించలేదు. ఆమె ట్వీట్ కు ముందు ఇది వాట్సాప్ లో  చక్కర్లు కొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. 

మీనా హారిస్ ట్విట్ తొలగించినప్పటికీ క్షమాపణ చెప్పాలని తాను వ్యక్తిగతంగా నమ్ముతున్నానని చెప్పారు. అమెరికాలో రాజకీయ సేవలో మతపరమైన ఐకానోగ్రఫీని ఉపయోగించకూడదని ఫోర్ట్ బెండ్ కౌంటీ 2018 లో ప్రకటన చేసిన సమయంలో తాను కూడ అదే చెప్పానని భూటాడా చెప్పారు.

 ఈ చిత్రం మత సమాజాన్ని కించపర్చిందని అమెరికన్ హిందువుల పరువు నష్టం కమిటీ కన్వీనర్ అజయ్ అభిప్రాయపడ్డారు.తాను ఈ ట్వీట్ ను తొలగించినా కూడ స్క్రీన్ షాట్లతో  తిరిగి రీ ట్వీట్ చేయడంతో తనకు మాటలు రావడం లేదని మీనా హారిస్ చెప్పారు.

 మమ్మల్ని ఎగతాళి చేయడం ద్వారా హిందువుల ఓట్లను గెలుచుకోబోతున్నారని మీరు అనుకోవడం సరైంది కాదని ప్రముఖ వైద్య రచయిత షెఫాలి అభిప్రాయపడ్డారు.ఈ విషయమై మరోసారి ఆలోచించుకోవాలని సూచించారు. ఈ ఫోటో హిందువులను అసంతృప్తిగా గురి చేయడంతో పాటు అవమానపర్చేదిగా ఉందని చెప్పారు. 

మా దైవత్వాన్ని ఎగతాళి చేయడం చిన్న విషయం కాదన్నారు. క్షమాపణ చెప్పకుండా ట్వీట్ తొలగిస్తారా అని ప్రశ్నించారు.జో బిడెన్, కమలా హారిస్ అమెరికాలోని హిందూ సమాజాన్ని  వారాంతంలో పలకరించనున్నారు. చెడుపై మరోసారి విజయం సాధించాలని వారు కోరుకొన్నారు.

నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాగానే  ప్రపంచ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకొనే వారికి జో బిడెన్ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మరోసారి విజయం సాధించవచ్చు.. అందరికి అవకాశాన్ని కల్పించాలని బిడెన్ ట్వీట్ చేశారు.