Asianet News TeluguAsianet News Telugu

డెల్టా కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి : డబ్ల్యూహెచ్‌వో.. ‘మహమ్మారి అంతం ఎప్పుడంటే’

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. కేసులు పెరుగుతున్న సందర్భంలో మళ్లీ ఆంక్షలు విధించే ఆలోచనలను ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇది వరకే నిపుణులు చెప్పినట్టుగా ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుందని, అందుకు ఆధారాలు ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో వివరించింది. అయితే, త్వరలోనే ఈ మహమ్మారికి రెండో, మూడో తరాల టీకాలు వస్తున్నాయని, మరిన్ని నూతన ఆవిష్కరణలు జరగాల్సి ఉన్నదని తెలిపింది.
 

omicron variant is faster than delta says WHO
Author
New Delhi, First Published Dec 21, 2021, 6:40 AM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron) దేశంలో కొత్త ఆందోళనలు సృష్టిస్తున్నది. డెల్టా వేరియంట్ దెబ్బతో దేశం తల్లడిల్లింది. బెడ్లు దొరక్క.. ఆక్సిజన్ కొరత.. వైద్యారోగ్య వ్యవస్థకు ఆ వేరియంట్ భయానక సవాల్ విసిరింది. ఆ ఘటనలు ఊహించుకోవడానికైనా జంకే పరిస్థితి ఉన్నది. ఇలాంటి పీడకల లాంటి ఘటను వెంటాడుతున్న తరుణంలో మరోసారి మహమ్మారి పడగ విప్పే ప్రమాదం ఉన్నది. గతంలో లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న డెల్టా వేరియంట్ కంటే కూడా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) స్పష్టం చేసింది. డెల్టా వేరియంట్ కంటే కూడా ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తుంది అనడానికి స్పష్టమైన ఆధారాలు ఇప్పుడు లభిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ వెల్లడించారు.

అంతేకాదు, ఈ వేరియంట్ టీకా వేసుకున్నవారికీ సులువుగానే సోకవచ్చునని ఆయన వెల్లడించారు. ఇప్పటికే కరోనా బారిన పడినవారికీ సోకే ముప్పు ఉన్నదని తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్టు ఈ వేరియంట్ గురించి మాట్లాడుతూ, ఇమ్యూన్ రెస్పాన్స్‌ను ఈ వేరియంట్ విజయవంతంగా ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు బూస్టర్ డోసుల పంపిణీ కార్యక్రమాలకు రంగం సిద్ధం చేశాయి. కొన్ని దేశాలు ఇప్పటికే బూస్టర్ డోసులు అందించడాన్ని ప్రారంభించాయి. కాబట్టి, అలాంటి దేశాలు ముందుగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సూచనలు చేశారు. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని టీకాలూ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను నిలువరించలేవు అని చెప్పలేమని పేర్కొన్నారు. ఈ వేరియంట్‌కు చికిత్స అందించడం కూడా కష్టతరమేనని అన్నారు. మోనోక్లోనల్ ట్రీట్‌మెంట్.. ఒమిక్రాన్ వేరియంట్‌ను నాశనం చేయలేదని వివరించారు. 

Also Read: Gujarat స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ప్రధాన నగరాల్లో night curfew

అయితే, డబ్ల్యూహెచ్‌వో బృందం ఓ ఆశాజనక శుభవార్తనూ తెలిపింది. వచ్చే ఏడాదిలో ఒమిక్రాన్ వేరియంట్‌తో ఎన్ని వేవ్‌లు వస్తాయో అనే భయంతో చాలా దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికా సహా కొన్ని దేశాల్లో ఒమిక్రాన్ కారణంగా వేవ్‌లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్‌వో ఉపశమనం ఇచ్చే వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్‌ కోసం ఇప్పటికే చాలా టీకాలు వచ్చాయని వివరించింది. అయితే, ఈ వైరస్‌కు మరిన్ని రెండో.. మూడో తరం టీకాలు వస్తున్నాయని తెలిపింది. ఈ టీకాలు, మరింత అధునాతన యాంటీమైక్రోబయల్ ట్రీట్‌మెంట్లు, ఇతర ఆవిష్కరణలతో కరోనా మహమ్మారి అంతం అవుతుందని వివరించింది. ఈ మహమ్మారి త్వరలోనే స్వల్ప లక్షణాలు కలిగి సులువుగా నయం అయ్యే వాధిగా మారిపోతుందని ఆశిస్తున్నట్టు డబ్ల్యూహెచ్‌వో టాప్ ఎమర్జెన్సీ నిపుణుడు మైక్ ర్యాన్ వెల్లడించారు. ఈ వైరస్ వ్యాప్తిని చాలా వరకు స్వల్పంగా ఉంచితే.. అప్పుడు కరోనా మహమ్మారిని అంతం చేయడం సులువు అవుతుందని వివరించారు.

ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుజ‌రాత్ స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉంటుంద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రించ‌డంతో ప‌లు ఆంక్షలు విధించింది. ఈ క్ర‌మంలో ప్రభుత్వం ఎనిమిది ప్రధాన నగరాల్లో నైట్‌ కర్ఫ్యూ విధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios