సింగపూర్: మన దేశంలో మహిళా రక్షణ కేవలం చట్టాలకే పరిమితమవుతోంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడటమే కాదు ఆ క్రమంలో హత్యలు చేసిన నిందితులు కూడా దర్జాగా బయట తిరుగుతున్న సంఘటనలు అనేకం. ఇదీ మన దేశంలో మహిళా రక్షణ. అయితే కొన్ని దేశాల్లో మహిళల రక్షణ విషయంలో చట్టాలు ఎంత కఠినంగా వుంటాయో తెలియజేసే సంఘటన ఒకటి బయటపడింది. 

సింగపూర్ దేశం మహిళల రక్షణ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ విషయం తెలియన చెల్లం రాజేష్ కన్నన్(26) అనే యువకుడు ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించి జైలుపాలయ్యాడు. 

రాజేష్ కు ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఓ మైనర్ బాలిక పరిచయమయ్యింది. పలుమార్లు బాలికను కలిసిన కన్నన్ ఆమెపై కన్నేశాడు. ఈ క్రమంలోనే బాలిక తన స్నేహితుల కోసం మద్యం తీసుకురావాల్సిందిగా రాజేష్ ని కోరింది. దీన్ని ఆసరాగా చేసుకుని బాలికను కలిసిన అతడు ఆమెను బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. అంతేకాకుండా తన లైంగిక వాంఛ తీర్చాలని బలవంతం చేశాడు. 

దీంతో బాలిక భయపడిపోయి అతడి నుండి తప్పించుకుని తల్లిదండ్రులు విషయాన్ని తెలిపింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి కన్నన్ ను అరెస్ట్ చేశారు. మైనర్ బాలికను బలవంతం చేసినందుకు గానూ అతడికి న్యాయస్థానం 7 నెలల జైలు శిక్ష విధించారు.